Ayodhya : 500 ఏళ్ల నాటి కల.. నెరవేరుతున్న వేళ.. హిస్టరీని తిరగేస్తే.. ఎన్నో ఘటనలు.. ఎన్నో మలుపులు

అయోధ్య లో నేడు విగ్రహావిష్కరణ సందర్భంగా దేశమంతా రామనామంతో మోగిపోతుంది. ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-01-22 03:16 GMT

అయోధ్య లో నేడు విగ్రహావిష్కరణ సందర్భంగా దేశమంతా రామనామంతో మోగిపోతుంది. అన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీరాముడి జన్మస్థలంగా ఆ భూమికి పేరుంది. అందుకే అయోధ్యకు దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ప్రత్యేకత ఉంది. రాములోరు పుట్టిన ఊరిని ఒక్కసారైనా చూడాలన్న తపన ప్రతి హిందువులో కనిపిస్తుంది. అందుకే అయోధ్య లో నేడు జరుగుతున్న కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తితో పరికిస్తున్నాయి. అయోధ్యకు ఇంతటి ప్రాచుర్యం నేడు రాలేదు. ఎప్పటి నుంచో శ్రీరాములు వారి పుట్టుక ప్రదేశమైన అయోధ్యకు ప్రత్యేక స్థానం ఉందని వేరు చెప్పాల్సిన పనిలేదు.

1528 లోనే....
చరిత్రను ఒకసారి పరిశీలస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. 1528లో రాముడి జన్మస్థలంగా భావించే ప్రదేశంలో అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ మసీద్ ను నిర్మించాడు. ఈ స్థలం కోసం 1853 నుంచే రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు, మసీదు వెలుపలి భాగాన్ని హిందువులకు కేటాయించారు. అప్పటి నుంచే అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. ఎంతో మంది అయోధ్య లో రామమందిర నిర్మాణం కోసం ప్రయత్నించారు. అయితే సాధ్యపడలేదు.
న్యాయస్థానంలోనూ...
1949లోనే మసీదులోపల రామలల్లా విగ్రహం బయటపడటంతో మరింత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపి మసీదు కు తాళం వేశారు. నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. అయితే 1950లో మసీదు లోపల బయటపడిన రామ్ లల్లా విగ్రహానికి పూజలు జరుపుకునేందుకు అనుమతించాలని ఫైజాబాద్ న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో రాముడి విగ్రహాన్ని తొలగించాలని కూడా ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే 1986లో హిందువల కల కొంత వరకూ సాకారమయింది. ఆ ఏడాది మసీదు తలుపులు తెరచి హిందువులు పూజలు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఇక 1992 డిసెంబరు 6వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చి కరసేవకులు అప్పటి బాబ్రీమసీదును కూల్చివేశారు. పెద్దయెత్తున హింస చెలరేగింది. దాదాపు రెండు వేల మంది నాటి ఘటనలో అశువులు బాశారు.
అనేక మంది...
అయితే ఈ ఘటనపై అనేక కేసులు నమోదయ్యాయి. 2001 లో అద్వానీ, మాజీ ముఖ్యమంత్రి క‌ల్యాణ్ సింగ్ తో పాటు పదమూడు మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 2002లో హిందూ భక్తులు వెళుతున్న గోద్రా రైలుకు నిప్పుపెట్టడంతో మరోసారి హింస చెలరేగింది. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత చెలరేగిర హింసతో మరో రెండు వేల మంది మరణించారు. దీంతో సుప్రీంకోర్టుకు అయోధ్య ఈ అంశం చేరింది. అయోధ్య కేసును పరిష్కరించడానికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. 2019 నవంబరు 9న అయోధ్య పై తీర్పు వచ్చింది. హిందువులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వివాద స్పద స్థలాన్ని రాముడికే కేటాయించాలని, మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కథ సుఖాంతమైంది.
మూడేళ్లలో నిర్మాణం...
దీంతో 2020 ఆగస్టు ఐదోతేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అనేక మంది విరాళాలిచ్చారు. రామ భక్తులు ఇచ్చిన విరాళమెంతో తెలుసా? మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పైనే. పదిహేను మంది సభ్యులతో ఏర్పడిన ట్రస్ట్ ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించింది. దాదాపు మూడేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. 1800 కోట్ల వ్యయం ఆలయ నిర్మాణానికి అయినట్లు అంచనా వినపడుతుంది. దీంతో నేడు బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇంతటి చరిత్ర ఉన్న... హిందువుల మనోభావాలతో నిండుకున్న రాముడు నేడు అయోధ్యలో కొలువు దీరే వేళ కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నాటి కల నేడు సాకారమవుతుంది.


Tags:    

Similar News