Sat Sep 07 2024 11:49:32 GMT+0000 (Coordinated Universal Time)
చరిత్ర సృష్టించిన చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి
చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ జంటగా నిలిచింది. టోక్యో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడీతో తలపడింది.
చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం.. చిరాగ్- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట మూడో గేమ్ లో 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలను ఓడించింది. సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇప్పటికే చిరాగ్- సాత్విక్ జోడీ కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలవగా.. ఈ టోర్నమెంట్ లో కూడా టైటిల్ నెగ్గాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.
ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్ కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్ లో కాంస్యం పతకం సాధించింది. పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. క్వార్టర్స్ లో 21-19, 6-21, 18-21తో చైనాకు చెందిన జావో జున్ పెంగ్చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, సాయి ప్రణీత్ ఇప్పటికే ఓడిపోయారు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ ప్రీక్వార్టర్స్ లో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో భారత్ కు కలిసి రాలేదు.
Next Story