Fri Dec 05 2025 11:37:34 GMT+0000 (Coordinated Universal Time)
Konda Murali : కొనసాగుతూనే ఉన్న "కొండా" ఎపిసోడ్.. ఎండ్ కార్డు పడదా?
గత కొద్ది రోజులుగా వరంగల్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలకు, కొండా కుటుంబానికి మధ్య పొసగడం లేదు. డైరెక్ట్ వార్ కు దిగారు.

కొండా కుటుంబం పంచాయతీ వరంగల్ లో కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా వరంగల్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలకు, కొండా కుటుంబానికి మధ్య పొసగడం లేదు. డైరెక్ట్ వార్ కు దిగారు. దీంతో వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కొండా మురళి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. పార్టీకి రాజీనామా చేయకుండా వచ్చి పెత్తనం చేస్తున్నారని, గతంలో వీరి వల్ల అనేక మంది అధికారాన్ని కోల్పోయారని కూడా వ్యాఖ్యానించారు. ఈ పంచాయతి కాంగ్రెస్ క్రమశిక్షణ ముందుకు వచ్చింది. క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరయిన కొండా మురళి లేఖ రాయడం మరో సంచలనానికి కారణమయింది.
మళ్లీ వ్యాఖ్యలతో...
దీంతో వరంగల్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. కొండా మురళి వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు. సొంత పార్టీ నేతలపై కొండా మురళి చేసిన విమర్శలను కూడా వీడియోలు, పత్రిక క్లిప్పింగ్ లను సమర్పించారు. కొండా మురళి పై చర్యలు తీసుకోవాలని కరారు. బస్వరాజు సారయ్య ఏకంగా కొండా మురళిపై పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు. మరోవైపు తాను గత ఎన్నికల్లో పదహారు ఎకరాలు అమ్మి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు పార్టీ హైకమాండ్ కు కూడా కొందరు ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.
మీనాక్షి నటరాజన్ ను కలసి...
ఈరోజు కొండా మురళి దంపతులు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కలిశారు. తాను బీసీ వర్గానికి చెందిన నాయకుడినని, తాను వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో గెలిపించుకుని వస్తానని కొండా మురళి తర్వాత మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడబోనని, తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారన్న కొండా మురళి పార్టీ హైకమాండ్ నిర్ణయం తనకు శిరోధార్యం అంటూనే తన కుమార్తె పరకాల టిక్కెట్ ను కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అది ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు కొండా మురళిపై చర్యలు తీసుకోకుంటే తాము హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని వరంగల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కొండా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉన్నట్లుంది.
Next Story

