Fri Dec 05 2025 09:51:47 GMT+0000 (Coordinated Universal Time)
Flash Floods : వరంగల్ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. నీట మునిగిన మూడు పట్టణాలు
మొంథా తుపాను వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. అర్థరాత్రి ఒక్కసారిగా వరద వచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలపై ప్రభావం చూపింది

మొంథా తుపాను వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. అర్థరాత్రి ఒక్కసారిగా వరద వచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలపై ప్రభావం చూపింది. దీంతో అనేక కాలనీలు నీటమునిగాయి. వర్షం తగ్గినా ఇంకా జలదిగ్బంధంలోనే వరంగల్ నగరం ఉంది. వరంగల్ లోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.హన్మకొండలో ఎక్కడ చూసినా నీళ్లే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఎస్టీఆర్ఎఫ్ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరంగల్, హన్మకొండ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
ట్రైసిటీలకు శాపం...
వర్షం నిలిచిపోయినా హనుమకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు వరద నీటితో నిండిపోయాయి. ట్రైసిటీలో అనేక కాలనీల్లో ఇంకా వరద నీరు వదల లేదు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు రాత్రి నుంచి అవస్థలు పడ్డారు. ఉదయానికి కూడా వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ ప్రయత్నాలు ఫలించడం లేదు. బీఆర్ నగర్ లో లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో డ్రోన్ల ద్వారా మంచినీరు, పాలు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు కావడం లేదు. బోట్ల ద్వారా వెళ్లాలంటే అవి అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బందికరంగా మారింది.
నడుముల్లోతు నీళ్లలో...
వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు పట్టణాలు మునిగిపోవడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయింది. కలెక్టర్ తో పాటు పోలీసులు, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ రైల్వే స్టేషన్ కూడా నీటితో మునిగిపోయింది. నడుముల్లోతు నీళ్లలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా భద్రకాళి రోడ్డులో ఉన్న సరస్వతి కాలనీ, వరంగల్ అండర్ బ్రిడ్జి నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సాయిగణేశ్ కాలనీ, డీకే నగర్, సంతోషిమాత కాలని, ఎస్ఎస్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్ నీట మునిగింది. వరంగల్ పట్టణంలోని దాదాపు నలభై కాలనీలు నీటిలో మునిగిపోయాయని చెబుతున్నారు.
29 సెంటీమీటర్ల వర్షపాతం...
వరంగల్ లో నిన్న రాత్రి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచే వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిన మొంథాదక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీవ్ర అల్పపీడనం కదులుతుంది. వచ్చే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మానికి 180 కిలో మీటర్ల దూరంలో తీవ్ర అల్పపీడనం ఉందని తెలిపారు. మంత్రి కొండా సురేఖ సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద వరంగల్ వరద నీటిలో చిక్కుకుని ఘొల్లుమంటుంది. ఈ నష్టం నుంచి తేరుకోవడం కష్టంగానే ఉంది.
Next Story

