Tue Jul 08 2025 16:51:44 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : విశాఖ వాసులకు తాగునీటి సమస్య.. 30 గంటలుగా నిలిచిపోయిన నీరు
విశాఖపట్నంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెతో తాగునీరు లేక నగరవాసులు అవస్థలు పడుతున్నారు

విశాఖపట్నంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెతో గత రెండు రోజుల నుంచి తాగు నీరు లేక విశాఖ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. నీటి సరఫరా నిలిచిపోవడంతో బయట నుంచి నీటిని కొందరు కొనుగోలు చేసుకుంటున్నారు. తాగేందుకు నీరు కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని విశాఖ వాసులు చెబుతున్నారు. మరొక వైపు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామని ఔట్ సోర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా పంపినా...
విశాఖపట్నంలోని అనేక ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విశాఖ అధికారులు కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా పంపించి నీటిని అందిస్తున్నారు. ట్యాంకర్ వస్తే చాలు యుద్ధమే జరుగుతుంది. దీంతో పోలీసు సిబ్బంది సహకారంతో ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నా ప్రజలు మాత్రం తాగు నీరు అందక పోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మూడు లక్షల ఇళ్లకు...
విశాఖపట్నంలోని దాదాపు 3 లక్షల ఇంటి కులాయిలకు నీటి సరఫరా నిలిచి పోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించి పోయింది. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను ఉద్యోగులు నిలిపివేయడంతో విశాఖ వాసులకు తాగునీరు అందడం లేదు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలోని అన్ని ట్యాంకులు ఖాళీ కావడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. తిరిగి ట్యాంక్ లు నింపాలంటే దాదాపు గంటల సమయం పట్టే అవకాముందని అంటున్నారు. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లయ్ ఉద్యోగులు చెబుతున్నారు. విశాఖలోని దాదాపు 99 వార్డులకు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు.
Next Story