Fri Dec 05 2025 14:14:07 GMT+0000 (Coordinated Universal Time)
Visakhapatnam : విశాఖ లో ఇక్కడ భూములు కొంటే బంగారమేనట.. భవిష్యత్ అంతా ఇక్కడేనంటున్నారుగా?
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముహూర్తం ఖరారయింది.

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముహూర్తం ఖరారయింది. 2026లోనే ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా ఇదే ప్రాంతానికి చెందిన యువ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఉండటంతో ఇక ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధికారులు రేయింబవళ్లూ కష్టపడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి వీలయితే ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
వేగంగా పనులు పూర్తి కావస్తుండటంతో..
అయితే విశాఖపట్నం ఎయిర్ పోర్టు కు ప్రత్యామ్నాయంగా ఈ భోగాపురం విమానాశ్రయం రూపుదిద్దుకోవడం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మారడంతో విమానల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇతరదేశాలకు వెళ్లాలంటే ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరుకు వచ్చివెళ్లాల్సిఉంది.కానీ ఇకపై ఈ విమానాశ్రయం నుంచి రద్దీని బట్టి నేరుగా ఇతరదేశాలకు విమానాలను ప్రయివేటు సంస్థలు నడిపే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు.దీనివల్లసమయం తగ్గడంతో పాటు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇక భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా పూర్తి కావస్తుండటంతో ఆచుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
భూములు కొనలేని పరిస్థితి...
అక్కడ భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి. అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశాయి. వెంచర్లు వేయడంతో చకచక అమ్ముడుపోయాయి. దీంతో పాటు తే భోగాపురం విమానాశ్రయం రాకతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు చింతపల్లి తీరంలో టూరిజం కాటేజీలను కేటాయించారు. ఈ మేరకు కాటేజీల పునర్నిర్మాణం జరుగుతోంది.నాలుగున్నర ఎకరాల్లో దీనిని చేపట్టారు. ఏపీ ప్రభుత్వం పర్యాటక శాఖకు 80 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ 80 ఎకరాల భూమిలో.. ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు.. మై కేర్ సంస్థకు 40 ఎకరాలు చొప్పున ఇచ్చారు. వీటికి తోడుగా ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా రానున్నాయి. భోగాపురం, భీమిలి మండలాల్లో ఏర్పాటు అవుతున్నాయి. జీఎంఆర్ సంస్థ 500 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది.
అదనపు ఆకర్షణగా...
వంద కోట్ల రూపాయలతో ఓ ప్రైవేట్ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం కూడా మొదలైంది. దాదాపుగా రూ.150 కోట్లతో ఎయిర్పోర్ట్ దగ్గర కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ఇప్పటికే తాజ్ హోటల్‌ను భీమిలి మండలంలో నిర్మించాలని నిర్ణయించడంతో ఇక ఇక్కడ అభివద్ధిని ఆపడంఎవరి తరమూ కాదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఒకవైపు 16వ జాతీయ రహదారి ఉండటం, మరోవైపు అందమైన, అందర్ని ఆకట్టుకునే సముద్రతీరం కూడా ఉండటంతో అదనపు ఆకర్షణగా మారనుంది. వీఎంఆర్డీఏతో పాటు ప్రభుత్వ శాఖలు ప్రయాణికులు సులువుగా చేరుకోవడానికి వీలుగా పదిహేను లింక్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. విశాఖపట్నం తీర రోడ్డును కూడా ఆరు వరుసలుగా విస్తరించాలని భావిస్తున్నారు.దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం దగ్గర వంద ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. భోగాపురంతో పాటుగా ఆనందపురం, భీమిలి, పూసపాటిరేగ, తగరపువలస వంటి ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందడనడంలో అతిశయోక్తి లేదు.
Next Story

