Fri Feb 14 2025 17:57:11 GMT+0000 (Coordinated Universal Time)
Vizag Steel Plant : విశాఖ ఉక్కుకు ఇక మంచి రోజులు వచ్చినట్లే.. కేంద్రం గుడ్ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేబినెట్ కమిటీ భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేబినెట్ కమిటీ భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కేబినెట్ భేటీ ఆమోదం తెలపడంతో దాదాపు 11,500 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రానున్నాయి. ఈ విషయాన్ని నేడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని తెలిసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి కార్మికులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మోదీ విశాఖ పర్యటనలోనూ...
ఇటీవల విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకపోవడంతో ఇక ప్రయివేటీకరణ దిశగా వేగంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అనేక సార్లు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఒకింత తలవంచిందనే చెప్పాలి. భారీ ప్యాకేజీని ఇచ్చేందుకు సిద్ధమయింది. విశాఖ ఉక్కును ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడానికి అవసరమైన 11,500 కోట్ల నిధులను ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా అంగీకరించడం కార్మికులు తమ తొలి విజయంగా భావిస్తున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కుకు ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తే ఇక లాభాల బాటపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.
కొంత కాలంగా నష్టాల్లో...
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వేలాది మంది కార్మికులు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం సంస్థగానే ఏపీ వాసులు చూడటం లేదు. అదొక సెంటిమెంట్ గా భావిస్తారు. వరగసా రెండేళ్ల నుంచి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుండటంతో కార్మిక వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఐరన్ ఓర్ ను దిగుమతి చేసుకునేందుకు అనుమతివ్వాలన్నది ప్రధాన డిమాండ్. అయితే ముడిసరుకు తెచ్చుకునేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సి రావడంతోనే తమకు కష్టాలు వస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మాత్రం అంతకంటే మంచి వార్త కొత్త ఏడాది ఇక ఏముంటుంది. నిజమైన సంక్రాంతి తమకు ఆరోజేనని కార్మికులు చెబుతున్నారు.
Next Story