Fri Dec 05 2025 12:19:38 GMT+0000 (Coordinated Universal Time)
Shrishti Fertility Center : నమ్రత గ్యాంగ్ పెద్ద ప్లాన్...సంతానంలేని దంపతులను గుర్తించిందిలా
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై నమోదయిన కేసులో తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంతానం లేని వారిని గుర్తించేందుకు డాక్టర్ నమ్రత పెద్ద ప్లాన్ వేశారు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై నమోదయిన కేసులో తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంతానం లేని వారిని గుర్తించేందుకు డాక్టర్ నమ్రత పెద్ద ప్లాన్ వేశారు. తాజాగా సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులను ఈడీ అధికారులు కోరారు. దాదాపు 86 మంది పిల్లల చైల్డ్ ట్రాఫికింగ్ కు నమ్రత పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో దాదాపు నలభై కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులతో పాటు ఇక ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత మందిని ఎవరికి విక్రయంచారు? బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించనుంది.
ఉచిత వైద్య శిబిరాలతో...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. సంతానం లేని వారు ఈ ఉచిత శిబిరాలకు రావడంతో వారిని గుర్తించడం సులువుగా మారింది. వారికి ఉచిత కన్సెల్టింగ్ ఇస్తామని కూడా నమ్మబలికారు. సంతానం కోసం పరితపించే వారి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు డాక్టర్ నమ్రత టీం ఇటువంటి ప్లాన్ లు వేసి భారీగా అటువంటి వారిని గుర్తించడమే కాకుండా, వారికి సంతానప్రాప్తి కలిగిస్తామని నమ్బలికింది. దీంతో అమాయకులు నమ్రత వలలో పడిపోయారు. సులువుగా నమ్మించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకునేందుకు డాక్టర్ నమ్రత చేసిన ప్రయత్నం సక్సెస్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై నమ్రత గ్యాంగ్ కన్నేసింది.
విశాఖకు తరలించి...
ఉచిత వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని యూనివర్సిటీ సృష్టి సెంటర్ కు రప్పించేవారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ఐవీఎఫ్ ద్వారా సంతాన ప్రాప్తి కలగదని వారికి చెప్పేవారు. సరోగసి ద్వారా సాధ్యమవుతుందని నమ్మకంగా చెప్పేవారు. వారికి చెందిన వీర్యం, అండాలతోనే సంతానం కలుగుతుందని వారిని భ్రమింప చేసేవారు. దీంతో డాక్టర్ నమ్రత చెప్పే మాయమాటలకు సులువుగా బుట్టలో పడిపోయేవారు. ఇలా అనేక మంది ముందుకు రాగా వారిని సికింద్రాబాద్ కు కాకుండా విశాఖపట్నంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు పంపించేవారు. అక్కడ ఉన్న సిబ్బంది సరోగసి అయితే ముప్ఫయి నుంచి అరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పేవారు.
కోట్లాది రూపాయలు వసూలు చేసి...
ఇందులో అక్కడ మేనేజర్ కల్యాణి కీలక భూమిక పోషించినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు. అయితే మరొకవైపు మధ్యవర్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అమాయక గిరిజన మహిళలకు ఆశ చూపి వారికి పుట్టబోయే శిశువులను తమకు విక్రయించాలని కోరేవారు. అందుకు వారికి నాలుగు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించేవారని పోలీసులు తెలిపారు. వారితో శిశువిక్రయ ఒప్పందాలు కూడా కుదుర్చుకునే వారు. అయితే అమాయక పేద మహిళలకు పుట్టిన బిడ్డలను తీసుకు వచ్చి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డలంటూ తమ వద్దకు వచ్చిన దంపతులను నమ్మించే వారు. ఇలా ఎంత మందిని కొనుగోలు చేశారు? ఎంతమందికి విక్రయించారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
Next Story

