Thu Dec 18 2025 17:59:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని రాక ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నంలో పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ప్రధాని మోదీ హాజరు కానున్నారు

ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నంలో పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని రాక, యోగా దినోత్సవ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి వచ్చినపుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుంచి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో "యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్" అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను
ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం "యోగాంధ్ర-2025" నినాదంతో ప్రజల్లో యోగాపట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచం ఏపీ వైపు చూసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Next Story

