పేటలో కోడెల కోట కూలడం ఖాయమేనా!!

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా వ్యవహరించిన గుంటూరు జిల్లా నేత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. హవా నానాటికీ తగ్గుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన డీలిమిటేషన్ కారణంగా తనను పలుమార్లు గెలిపించిన నరసరావుపేటను వదులుకుని సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. ఇక్కడి నుంచి కూడా గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, తన సీనియార్టీ కారణమో? లేక.. తనకు ఎదురులేదన్న ధీమానో తెలియదు కానీ, ఈ రెండు నియోజకవర్గాలపైనా కోడెల ఆధిపత్యం నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజానికి నరసరావు పేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. అయినప్పటికీ.. ఇక్కడ అనధికార ఎమ్మెల్యేగా కోడెల చలామణి అవుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేను పక్కనపెట్టి.....
ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం అందదు. ప్రొటోకాల్ ఇక్కడ చెల్లుబాటు కాదు. అన్ని కార్యక్రమాలూ కోడెల చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఈ విషయం సాక్షాత్తూ అసెంబ్లీలోనే చర్చకు వచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, సత్తెన పల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, వైసీపీ ఎమ్మెల్యే విషయాన్ని పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలను కూడా కోడెల పక్కన పెడుతున్నారని అంటున్నారు స్థానిక తమ్ము ళ్లు. తాము ఎంతో కష్టపడుతున్నా గుర్తింపు లేకుండా పోతోందని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా నియోజ కవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు చంద్రబాబు. అయితే, నరసరావు పేటకు మాత్రం ఎలాంటి ఇంచార్జీ కూడాలేకపోవడం గమనార్హం.
నియోజకవర్గ ఇన్ ఛార్జిని ప్రకటించక పోవడంపై.....
ఇటీవల టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రకటించక పోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్లక్ష వైఖరికి నిరసనగా నేటి (శనివారం) నుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి పరోక్షంగా కోడెలపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిను నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతానికి.....
నరసరావుపేటలో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓటమిని చవి చూసిందని. ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరడం గమనార్హం. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కోడెల హవా ఇప్పటికీ కొనసాగుతుండడంతోనే టీడీపీ బలం పుంజుకోలేక పోతోందని అంటున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలు జై కొడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నరసరావుపేట సహా సత్తెనపల్లిలోనూ కోడెల హవా దెబ్బతినడం ఖాయమని, టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. మరి బాబు ఇప్పటికైనా గ్రహిస్తారో లేదో చూడాలి.