కబడ్డీ కబడ్డీ : మొదలవక ముందే పాక్కు ముష్టిఘాతం!

భారత్ లోని అహ్మదాబాద్లో ఈనెలలో కబడ్డీ ప్రపంచకప్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇటీవలి కాలంలో భారత్లో క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు కూడా ఆదరణ బాగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు మనదేశంలో నిర్వహిస్తున్న ప్రపంచకప్ కబడ్డీ టోర్నీని చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ టోర్నీ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్కు గోదాలోకి దిగకముందే.. ముష్టిఘాతం తగిలింది. ఆ దేశం ఇప్పుడు అవమానంతో కుతకుత ఉడికిపోయే పరిస్థితి ఎదురైంది.
అహ్మదాబాద్లో జరిగే కబడ్డీ ప్రపంచకప్ టోర్నీకి పాకిస్తాన్ ను అనుమతించకూడదని ప్రపంచ కబడ్డీ ఫెడరేషన్.. బుధవారం నిర్ణయించింది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే టోర్నీ మొదలు కాబోతుండగా.. ఒక దేశాన్ని నిషేధించడం అనేది బహుశా క్రీడా చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన కావచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఎంత అరుదైనదో, అంతే అవమానకరమైన సంఘటన అని కూడా వారు పేర్కొంటున్నారు.
కాగా, పాకిస్తాన్ సహజంగానే ఈ నిర్ణయం మీద కుతకుత ఉడికిపోతోంది. ఇది చాలా అవమానంగా వారు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తిస్తూ వారిని దూరం పెట్టడానికి, ఒంటరిని చేయడానికి ఒక్కొక్కరూ సుముఖంగానే ఉన్నారనడానికి ఈ ప్రపంచ కబడ్డీ ఫెడరేషన్ నిర్ణయం ఒక రుజువుగా పేర్కొనాలి.

