హోదా కోసం జగన్

వైసీపీ అధినేత జగన్ నేడు పాదయాత్రకు విరామం ప్రకటించారు. మార్చి 1వ తేదీన ప్రత్యేక హోదా కోసం వైసీపీ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్లను ముట్టడించాలని వైసీపీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఉద్యమ కార్యాచరణకు దిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రంలో కదలిక తేవాలన్న లక్ష్యంతో వైసీపీ సిద్ధమైంది.
రెండు రోజులు పాదయాత్రకు విరామం....
నేడు వైసీపీ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో వైసీపీ నేత జగన్ పాదయాత్రకు ఈరోజు విరామాన్ని ప్రకటించారు. అలాగే శుక్రవారం కూడా పాదయాత్ర చేయడం లేదు. హోలీ సెలవు దినం కావడంతో ఆయన తిరిగి మార్చి 3వ తేదీన పాదయాత్రను ప్రారంభిస్తారు. ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో జరుగుతోంది. నిన్న పాదయాత్ర పూర్తయిన వెంటనే జగన్ యాత్రకు రెండు రోజుల విరామాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ పార్టీ శ్రేణులకు, నేతలకు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఉద్యమ కార్యాచరణ....
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే వైసీపీ కార్యాచరణను ప్రకటించింది. నేడు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ముగిసిన తర్వాత మార్చి 3వ తేదీన ఢిల్లీకి పార్లమెంటు సభ్యులు బయలుదేరి వెళతారు. పార్లమెంటు సభ్యులతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా ఢిల్లీలో ఈ నెల 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేరడానికి బయలుదేరి వెళతారు. ఈ వాహన శ్రేణికి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అప్పటికి ప్రకాశం జిల్లా దర్శి మండలం తాళ్లూరు లో పాదయాత్ర జరుగుతుంటుంది. మార్చి 5వ తేదీన ధర్నా చేసిన అనంతరం మరుసటి రోజు నుంచి పార్లమెంటులో ప్రత్యేక హోదా నినాదాలు చేస్తారు. ఆందోళనకు దిగుతారు. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. ఇలా పాదయాత్రలో ఉంటూనే జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని షురూ చేశారు.
- Tags
- జగన్

