హోం మంత్రి ఇలాకాలో దర్జాగా ...!

ఏపీ హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గంలోనే కోడిపందాలు, గుండాట జోరుగా సాగాయి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం లో పందెం రాయుళ్లకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోయారు. కోర్ట్ ఆదేశాలను హోమ్ మంత్రి నియోజకవర్గంలో ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక్కడ జరిగిన కోడి పందాలు, గుండాటల్లో మగ వారితో పోటీ పడి మరీ మహిళలు పాల్గొనడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా అంతా ఇదే తంతు నడిచింది.
డే అండ్ నైట్ పందేలు...
క్రికెట్ మ్యాచ్ లను తలపించే విధంగా గోదావరి జిల్లాలో కోడి పందాలను పందెం రాయుళ్లు డే అండ్ నైట్ మ్యాచ్ లు గా నిర్వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పగలు రాత్రి తేడా లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా కత్తులు కట్టి పోటీలు నిర్వహించారు. జనం కూడా అదే రీతిలో వీటిలో పాల్గొంటూ పందాల్లో జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. టిడిపి నేతలు దగ్గరుండి మరీ కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు చేష్టలుడిగి చూడటం తప్ప యాక్షన్ తీసుకునే సీన్ లేకుండా పోయింది. లక్షలు కోట్ల రూపాయలు కోడి పందాలు సాగిన ప్రాంతాల్లో చేతులు మారాయి. పల్లెలంతా ఈ కోడి పందాల కోలాహలం తో హోరెత్తిపోయాయి.
ఏపీకి ధీటుగానే తెలంగాణాలో ...
వాస్తవానికి సంక్రాంతి పండుగ తెలంగాణ తో పోలిస్తే ఏపీలో బాగా జరుగుతుంది. కానీ ఈసారి తెలంగాణ పల్లెలో సంక్రాంతి పండుగను పెద్దఎత్తునే ప్రజలు కొనసాగించారు. హైదరాబాద్ లో నగర వాసులను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్ లలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గాలిపటాల పోటీలు, సాహస బైక్ రైడింగ్ లు, స్వీట్ ఫెస్టివల్ వంటి వాటితో కుటుంబ సమేతంగా అలరించేలా ఏర్పాట్లు వున్నాయి. తమ సొంత ఊళ్లకు ఏపీ కి చెందిన వారు వెళ్ళి సందడి లేకుండా వుండే భాగ్యనగరం ఈసారి వివిధ క్రీడా సాంస్కృతిక సంబరాలతో ఆకర్షణీయంగా మారింది. ఇక వరంగల్, ఖమ్మం, మెదక్ కరీంనగర్ ప్రాంతాల్లో సంక్రాంతి కి కొత్త శోభ వచ్చింది.
తమిళనాడు చిత్తూరు లలో జల్లికట్టు ...
ఇక తమిళనాడు లోని పల్లెలు జల్లికట్టు క్రీడా సంబరాలతో సంక్రాంతి నిర్వహించాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ప్రజలు జల్లికట్టు పోటీలు ఏర్పాటు చేసుకుని పండగ చేసుకున్నారు. ఈ పోటీల్లో అనేకమంది గాయపడగా పశువులు సైతం గాయాలపాలయ్యాయి. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

