హైదరాబాద్ లో వీళ్లిక కన్పించరేమో...!

నగరంలోని బిచ్చగాళ్లు, అనాధలకు ప్రత్యేక ఆశ్రమం కల్పించేందుకు సిద్దమయ్యింది తెలంగాన జైళ్ళశాఖ . ఆనందాశ్రమం పేరుతో ప్రత్యేక బ్యారక్ లను ఏర్పాటు చేస్తున్నారు. 400 మంది పట్టే విధంగా ఈ బ్యారక్ లను సిద్ధం చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో 81 మందిని, చర్లపల్లిజైలు లో 44 మందిని ఉంచారు. కీలకప్రాంతాలలో బిచ్చమెత్తుకుంటున్న వారిని తీసుకువచ్చి ఆనందాశ్రమంలో ఉంచుతున్నారు. వారికి తిండి వసతి కల్పించడంతో పాటు పెట్రోల్ బంక్ లో పనికల్పిస్తున్నారు.
సిటీ మొత్తం బిచ్చగాళ్లే....
హైదరాబాద్ లో చెట్లు కనిపించని ప్రదేశం ఉంటుందేమో కాని బిచ్చగాళ్లు కనిపించని ప్లేస్ అస్సలు కనిపించదు. అయితే ఇలాంటి వాటి పై దృష్టి సారించింది తెలంగాణా సర్కార్. తెలంగాణా జైళ్లశాఖ, జీహెచ్ఎంసీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా అంత సక్సెస్ అవ్వట్లేదు . అయితే తెలంగాణ జైళ్ళ శాఖ ఇలాంటి వారందరి కోసం ప్రత్యేక బ్యారక్ లను ఏర్పాటు చేస్తోంది. ఆనందాశ్రమం పేరిట చంచల్ గూడ, చర్ల పల్లి జైలులో మహిళలు పురుషుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. చంచల్ గూడా లో పురుషులకు చర్లపల్లిలో మహిళలను ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
చర్లపల్లి, చంచల్ గూడలో ప్రత్యేక బ్యారక్ లు....
ఇప్పటి వరకు చర్లపల్లి జైలులో 44 మంది మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులను ఉంచారు. చంచల్ గూడా జైలులో 81 మంది పురుషులను ఉంచారు. వీరిలో బిచ్చగాళ్లం కాదని వాదించేవారిని పూచికత్తు మీద పంపిస్తున్నారు అయితే రెండో సారి బిచ్చమెత్తుతూ కనిపిస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. బిచ్చమెత్తుతూ కనిపించేవారి పూర్తి వివరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ లో నమోదు చేస్తారు. ఇలా తెచ్చిన వారికి రోజు తిండి తదితర వసతులు జైళ్ళశాక ఏర్పాటు చేస్తుంది. వీరిలో పనిచేసే వారిని జైళ్ళశాఖ అధీనంలో ఉన్న పెట్రోల్ బంక్ లో పనికి పెడతారు రోజుకు వంద రూపాయల భత్యం ఇస్తారు.అయితే గుడి వద్దకు వెళ్ళిన తమని బలవంతంగా తీసుకువచ్చారని ఆరోపిస్తున్నారు అక్కడి వచ్చినవారు. దాదాపుగా ప్రతి ఒక్కరు ఇదే సమాధానం చేప్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ కనిపించే వారిని తీసుకువచ్చి ఇక్కడ వాళ్లకి వసతి పని కల్పిస్తామంటున్నారు జైళ్లశాఖ డిజి వికె సింగ్. బెగ్గర్ ఫ్రీసిటీ చెయ్యడమే తమ లక్ష్యమని త్వరలో 6 పెట్రోల్ బంక్ లను జైళ్ళ శాఖ నుంచి ప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేసారు. గతంలో జిహెచ్ ఎమ్ సి ఇదే తరహాలో చేసి విఫలమవడంతో జైళ్ళశాఖ కాస్త అలర్ట్ గానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే..

