హైదరాబాద్ ఖాళీ అయిందే...!

ఏడాది పొడవునా కన్నవారికి వున్న వూరికి దూరంగా వుండే వారంతా సంక్రాంతి పండుగకి సొంత గూటికి చేరే ప్రయత్నాల్లో నరకం చవి చూసారు. బస్సు, రైలు, సొంత వాహనం ఇవేవి కాకుండా విమానాలు ఆశ్రయించిన వారికి చుక్కలు కనిపించాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బస్సులు వేలసంఖ్యలో ఏర్పాటు చేసినా ప్రయాణికులు లక్షల్లో వుండేటప్పటికీ అంతా చేతులు ఎత్తేయాలిసివచ్చింది. బస్సుల్లో కూడా మూడు నాలుగు రేట్లు అధిక ధరలకు టికెట్లు పెంచడం తో పండగ పూర్తి కాకుండానే కుటుంబ సమేతంగా బయల్దేరిన వారి జేబులు ఖాళీ అయిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇసుక వేస్తే రాలనంత మంది ఉండటంతో ప్రత్యక్ష నరకానికి ప్రయాణికులు గురయ్యారు. ఇక విమానాల ధరలు ఆకాశాన్ని తాకాయి. సొంత వాహనాల్లో బయల్దేరిన వారికి టోల్ గేట్లు ట్రాఫిక్ జామ్ లు మరో రకమైన హింసను చవిచూపించాయి.
బాదుడే బాదుడు ....
పండగ స్పెషల్స్ పేరుతో టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఎస్ ఆర్టీసీ, రైల్వే శాఖలు డబుల్ ధమాకా మోగించాయి. ప్రయాణికులను పిండటమే లక్యంగా పెట్టుకుని స్పెషల్ పేరుతో ప్రత్యేక దోపిడీ చేశాయి. ప్రతి పండుగకు ఇదే విధంగా ఎప్పటికప్పుడు ధరలు పెంచుతూ సాగుతున్న సర్కార్ మార్క్ దారి దోపిడీపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
ఖాళీ అయిపోయిన హైదరాబాద్ ...
సంక్రాంతి వచ్చింది అంటే చాలు హైదరాబాద్ ఖాళీ అయినట్లు గా ఏ మెట్రో సిటీ ఉండదేమో. తెలుగురాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాజధాని ఉద్యోగాలకు అందరికి కేంద్ర బిందువుగా విరాజిల్లుతున్న నేపథ్యంలో భాగ్యనగర్ నుంచి పెద్ద పండుగకు భారీగా తరలిరావడం దశాబ్దాలుగా వస్తున్నదే. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్ రొటీన్ కి భిన్నంగా ఈ నాలుగు రోజులు కనిపిస్తుంది. దాంతో భాగ్యనగర్ ను తిలకించాలనుకునే వారికి పండగకు వూర్లు వెళ్ళని వారంతా నగర సందర్శనకు బయలుదేరుతున్నారు.
- Tags
- హైదరాబాద్ ఖాళీ

