హార్థిక్ మోడీ విజయాన్ని దెబ్బతీస్తారా?

గుజరాత్ ఎన్నికలు అన్ని పార్టీలనూ గడగడ లాడిస్తున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ ఇప్పుడు కీరోల్ పోషించనున్నారు. హార్థిక్ చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. హార్థిక్ ఎవరికి అండగా నిలిస్తే వారిదే విజయమంటున్నారు. గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి దాదాపు 14 శాతం ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ కమలం ఖాతాలో పడ్డాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. కమలం పార్టీపై పటేళ్లు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు హార్థిక్ పటేల్ సహచరులను చీల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలతో అది మరింత పెరిగింది. ప్రస్తుతం హార్ధిక్ పటేల్ బీజేపీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పటేళ్లకు న్యాయం జరగదని ఆ సామాజిక వర్గంలో స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నాడు హార్థిక్. సోషల్ మీడియా ద్వారా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు.
లోపాయికారిగా కాంగ్రెస్ కే.....
అయితే హార్థిక్ ఇంతవరకూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. నిన్న రాహుల్ గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చినా దాన్ని హార్థిక్ అనుచరులు ఖండించారు. గజ దొంగ కంటే దొంగకే మద్దతివ్వడం మేలని హార్థిక్ అభిప్రాయపడ్డారు. అంటే పరోక్షంగా తాను కాంగ్రెస్ కే మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతుంది. బీజేపీ గుజరాత్ ను తమ ఆస్తిగా భావిస్తుందన్నారు. తానీమీ మోడీ లాగా నవాజ్ షరీఫ్ ను కలవలేదని విమర్శించారు. దీంతో రాహుల్ పార్టీ మాత్రం హార్థిక్ తమకే మద్దతు తెలుపుతారని భావిస్తోంది. పటీదార్ల ఉద్యమాన్ని బీజేపీ అణిచివేసిందన్నకోపంతో హార్థిక్ ఉన్నారు. బయటకు మద్దతు ప్రకటించనప్పటికీ లోపాయికారిగా హార్థిక్ కాంగ్రెస్ కే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. ఇక ఠాగూర్లు కూడా 22 శాతం మంది ఉన్నారు.వీరంతా మోడీకి వ్యతిరేకంగానే ఉన్నారు. పటేళ్లు, ఠాగూర్లు దూరమైతే బీజేపీకి కష్టకాలమే. అందుకే ఇప్పుడు కమలనాధులు ఓబీసీల వైపు చూస్తున్నారు. వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు కాషాయ పార్టీ సిద్దమైందని తెలుస్తోంది. హార్థిక పటేల్ మాత్రం ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది.
- Tags
- హార్థిక్ పటేల్

