హార్థిక్ ఎందుకిలా?

గుజరాత్ పటీదార్ల నేత హార్థిక్ పటేల్ ఇలా ఎందుకు మాట మార్చారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బహిరంగంగా మద్దతిచ్చి రాహుల్ నాయకత్వాన్ని సమర్థించాలని చెప్పిన హార్థిక్ పటేల్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ అసలు నాయకుడే కాదని హార్థిక్ పటేల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పటీదార్ల రిజర్వేషన్ల కోసం హార్థిక్ పటేల్ గత కొన్నేళ్లుగా గుజరాత్ లో ఉద్యమం చేస్తున్నారు. 24 ఏళ్ల హార్థిక్ పటేల్ అనతికాలంలోనే నేతగా ఎదిగారు. రిజర్వేషన్ల ఉద్యమంలో ఆయనను రాష్ట్ర బహిష్కరణకు కూడా గురయ్యారు.
గుజరాత్ ఎన్నికలలో చేతులు కలిపి.....
హార్థిక్ పటేల్ ప్రతిపాదించిన రిజర్వేషన్లకు గత గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సమర్థించింది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసి తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. అయినా కూడా గత ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీయే గెలిచింది. పటీదార్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఎన్నికలకు ముందు రాహుల్ తో హార్థిక్ పటేల్ ఒక హోటల్ లో భేటీ అయ్యారని, పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా హల్ చల్ చేశాయి.
రాహుల్ నాయకుడు కాదంటూ....
అయితే హార్థిక్ పటేల్ ఎన్నికల తర్వాత కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఈవీఎంల వల్లనే గెలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు తనతో కలిసి వస్తే దీనిపై న్యాయపోరాటం చేస్తానని కూడా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో హార్థిక్ పటేల్ రాహుల్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అసలు రాహుల్ నాయకుడే కాదని హార్థిక్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. తాను రాహుల్ ను నేతగా ఎప్పుడూ చూడలేదని, ఒక వ్యక్తిగా రాహుల్ అంటే తనకు ఇష్టమని హార్థిక్ చెప్పడం విశేషం.
ప్రియాంక రావాలంటూ.....
ఇక్కడ ఇంకో విశేషమేంటంటే...రాహుల్ కుబదులు ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని హార్థిక్ పటేల్ కోరడం. ప్రియాంక వాద్రాకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆమె రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పడం విశేషం. మరోవైపు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయబోనని హార్థిక్ పటేల్ ప్రకటించారు. తనకు పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించడమే ముఖ్యమని, ఆ దిశగానే తన పోరాటం సాగుతుందని హార్థిక్ పటేల్ స్పష్టం చేయడం విశేషం. ఇంతకీ రాహుల్ నాయకుడిగా ఎందుకు పనికారరన్నదానికి స్పష్టమైన సమాధానమివ్వలేదు హార్థిక్.
- Tags
- హార్థిక్ పటేల్

