హరీష్రావు.. విపక్షాలకు నిర్మాణాత్మక సవాలు

‘ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందేనెహె’ అంటూ గబ్బర్ సింగ్ చెప్పినట్లుగా, ఎక్కడైనా సరే ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు తాముచేస్తున్న ప్రతి పనీ అద్భుతం అంటూ టముకు వేసుకోవడమూ...
ఎదుటి వాడి మీద బురద చల్లితే తప్ప తమకు బతుకు ఉండదనే భయంలో... విపక్షాలు ప్రతి పనినీ తూర్పార పడుతూ ఉండడమూ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సహజం.
ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. తెరాసపై కాంగ్రెస్, తెలుగుదేశం తీవ్రస్థాయిలో ప్రతి చిన్న విషయానికీ విరుచుకుపడుతున్నాయి. కాస్త ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 21న ప్రత్యేకంగా పనిట్టుకుని ఒక రోజు దీక్షను కూడా నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. తెరాస తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఒక్కదానిని కూడా కార్యరూపం లోకి తీసుకురాలేదన్నది కాంగ్రెస్ వారి ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి, కీలక నాయకుడు అయిన తన్నీరు హరీష్ రావు.. విపక్షాలకు ఓ నిర్మాణాత్మకమైన సవాలు విసురుతున్నారు.
ఎన్నికల మేనిఫెస్టో కాపీలను కూడా జత చేస్తూ.. ఏయే హామీలను ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసిందో, చేస్తున్నదో సాధికారికంగా వివరించే ఒక డాక్యుమెంట్ ను ఆయన తయారు చేయించారు. దానిని మీడియాకు విడుదల చేసిన.. హరీష్రావు.. దీనిని గాంధీభవన్ కు కూడా కాపీలు పంపిస్తున్నాం.. అని.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ఏవిధంగా నెరవేర్చిందో ఇందులో చూసి కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని అంటున్నారు. దీని తర్వాత కూడా పాలనను తప్పుపడితే సమాధానం చెబుతాం అంటున్నారు. హామీలేవి అమలు చేయడం లేదని అంటూ.. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హరీష్ అంటున్నారు.
విపక్షాలకు సాధారణంగా ఇంతకంటె ఇరుకున పెట్టే ప్రతిసవాలు ఉండదు. ఇప్పుడు నిజంగా అయితే ఈ డాక్యుమెంట్ ను కాంగ్రెస్ నాయకులు శల్యపరీక్ష చేయాలి. హామీలు నెరవేరుస్తున్నాం అని చెప్పిన హరీష్ డాక్యుమెంట్ వాస్తవదూరమని నిరూపిస్తే.. వారి దీక్షకు కొంతైనా విలువ ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్ ను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తే.. వారి దీక్ష దురుద్దేశాలతో కూడిదని తేలిపోతుంది.
కాంగ్రెస్ నాయకులు చిల్లర ప్రచారం కోసం దీక్షలు చేస్తే గనుక ప్రజల దృష్టిలో వారే పలుచన అవుతారని హరీష్ హెచ్చరిస్తున్నారు. దీక్షకు ఇంకా రెండు వారాలపైగా గడువుండగా... దీనికి కాంగ్రెస్ వారి స్పందన ఎలా ఉంటుందో?

