హరీష్ సామ్రాజ్యంలో డిజిటల్ జీవనానికి శ్రీకారం

దేశమంతా డిజిటల్ ఆర్థిక లావాదేవీల గురించి స్మరిస్తున్న వేళ... తెలంగాణలో మోడల్ గా తీర్చిదిద్దదలచుకున్న హరీష్ రావు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఈదిశగా తొలి అడుగు వేశారు. ప్రజలందరూ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు మాత్రమే నిర్వహించేలా.. ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. గ్రామంలోని ప్రజలు అందరికీ బ్యాంకు అకౌంట్లు ఏర్పాటుచేసి, వారందరికీ డెబిట్ కార్డులు కూడా ఇచ్చేశారు. మంత్రి హరీష్ నియోజకవర్గం సిద్ధిపేట పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామమే ఈ కసరత్తుకు వేదిక అయింది.
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అనేది మోదీ సర్కారు ఎంచుకున్న బృహత్ లక్ష్యం. ఈ లక్ష్యం వైపు అడుగులు వేసే ప్రయత్నంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొత్త చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీ కూడా అనేక కొత్త చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట డిజిటల్ యుగం వైపు నడవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రమంతా ప్రజలు అలా మారేలా చర్యలు తీసుకుంటామని, తొలుత సిద్ధిపేట నియోకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం అని ప్రకటించారు.
మంత్రి హరీష్ రావు ఆ మరురోజే సిద్ధిపేటలో బ్యాంకర్లతో సమావేశం పెట్టుకుని.. ఏం చర్యలు తీసుకుంటే ప్రజల డిజిటల్ లావాదేవీలు మెరుగుపడతాయో సమీక్షించారు. సిద్ధిపేట నియోజకవర్గంను మోడల్ గా తీర్చిదిద్దాలని కేసీఆర్ ప్రకటించగా, అందులోనూ తొలి అడుగుగా ఇబ్రహీం పూర్ గ్రామాన్ని హరీష్ ఎంపిక చేసుకున్నారు. ఆ గ్రామంలో నూరుశాతం డెబిట్ కార్డులు పంపకం పూర్తిచేశారు. ఇక వాడకంలో కూడా వారు ఒక అడుగు వేయగలిగితే.. శుభప్రదంగా శ్రీకారం చుట్టినట్లే.

