హరీష్ రావు తో పెట్టుకుంటే ...?

టిఆర్ ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తరువాత పవర్ సెంటర్స్ ఆయన కుమారుడు కేటీఆర్ , కుమార్తె కవిత , మేనల్లుడు హరీష్ రావు లు అన్న సంగతి తెలిసిందే. వీరెవరితో పెట్టుకున్నా పదవులకు గ్యారంటీ మాత్రం లేదు. తాజాగా కృష్ణా జలాల యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ హరీష్ కొట్టిన దెబ్బకు పదవినుంచి వైదొలగాలిసి వచ్చింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల నడుమ జలజగడంలో సమీర్ ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని హరీష్ రావు గతంలోనే ఆయన్ను హెచ్చరించారు. ఆయన అదే దూకుడు ప్రదర్శించడంతో హరీష్ కి కాలింది.
హరీష్ లేఖతో ...
సమీర్ ఛటర్జీ ధోరణితో విసిగిపోయిన హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. తెలంగాణ ప్రయోజనాలను సమీర్ తీవ్రంగా దెబ్బతీసేలా ప్రవర్తించారన్నది హరీష్ అభియోగం . దీనిపై విచారించిన కేంద్రం హరీష్ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సమీర్ ఛటర్జీ ని బాధ్యతల నుంచి తప్పు కోవాలని ఆదేశించింది. ఆయన తప్పుకున్న వెంటనే ఆ బాధ్యతలను పోలవరం చీఫ్ ఇంజనీర్ గా వున్న పరమేశ్వర్ కి అప్పగించింది. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ఏదన్నా తలుచుకుంటే ఆపని పూర్తి అయ్యే వరకు వదలరన్న ప్రచారం వుంది . ఈ సంఘటనతో మరోసారి అది వాస్తవమే అని తేలింది.
- Tags
- హరీశ్ రావు

