హమ్మ...లాలూ...నువ్వు గ్రేట్ గురూ...!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నా.. ఆయనకు సపర్యలు చేసేందుకు ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. జైల్లో ఉంటే ఎలా సపర్యలు చేస్తారనేగా మీ డౌటు. నిజం.. పశుగ్రాస కుంభకోణంలో లాలూ యాదవ్ కు మూడున్నరేళ్లు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆయన బీర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. లాలూ యాదవ్ కు బయట ఉన్నప్పుడు అన్ని సపర్యలు చేసే ఇద్దరు ఒక కేసులో తమంతట తామే ఇరుక్కుని మరీ అదే జైలుకు వెళ్లారు. ఎందుకంటే బాస్ కు సపర్యలు చేసేందుకు. ఆయనకు అవసరమైనవన్నీ వెంటనే అందించేందుకు.
తమపై తామే కేసులు...
లాలూ యాదవ్ జడ్ ప్లస్ కేటగిరిలో ఉంటారు. గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్న ఆయనకు అత్యంత ఆప్తులయిన ఇద్దరు వ్యక్తులుండేవారు. ఒకరు ఆయనకు అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసే వారు ఒకరుకాగా, ఆయన వ్యక్తిగత పనులు చూసుకునే వారు మరొకరు. వారే లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ లు. వీరిద్దరూ ఇప్పుడు లాలూ యాదవ్ ఉన్న బీర్సా ముండా జైల్లోనే ఉన్నారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు. వీరు నేరస్థులు కూడా కాదు. కాని తమ బాస్ కోసం వారు నేరస్థులుగా మారారు.
లాలూకు తోడుగా....
లాలూ యాదవ్ కు జైలు శిక్ష ఖరారును చేస్తూ గత నెల 23వ తేదీన రాంచీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. శిక్ష ఎంతనేది అప్పుడు ఖరారు చేయలేదు. దీంతో శిక్ష పడి జైలుకు లాలూ వస్తారని భావించిన లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ లు తనకు తెలిసిన వ్యక్తితో తనపైనే కేసు పెట్టించుకున్నారు. రాంచీలోని తన ఇంటిపై వీరిద్దరూ దాడి చేశారని సుమిత్ యాదవ్ అనే వ్యక్తి వీరిపై కేసు పెట్టారు. తనను కొట్టడమే కాకుండా పదివేల రూపాయలు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే వీరు కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. దీంతో వీరిని బీర్సాముండా జైలుకు తరలించారు. లాలూకంటే ముందుగానే వీరు అదే జైలుకు చేరుకున్నారన్నమాట. అంటే లాలూకు జైలులో ఎటువంటి కష్టం రాకుండా... తోడుగా ఉండేందుకు తప్పుడు కేసును తమంతట తామే పెట్టించుకుని వెళ్లారు. వీరి స్వామి భక్తి మరీ ముదిరి పాకాన పడినట్లుంది.
- Tags
- లాలూ యాదవ్

