స్మృతికి సూపర్ ఛాన్స్?

గుజరాత్ కు ఇప్పుడు కమలం పార్టీకి ఒక లీడర్ కావాలి. అక్కడ నాయకత్వ లేమి సమస్య తీవ్రంగా ఉందని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. కేవలం మోడీ కారణంగానే గుజరాత్ ఎన్నికల్లో అతికష్టం మీద బయటపడిన కమలం పార్టీ ఈసారి ఆ తప్పు చేయదలచుకోలేదు. సరైన లీడర్ ను అక్కడ ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ సమర్థంగా వ్యవహరించలేకపోవడం వల్ల, ఆయన జనాకర్షక నేత కాకపోవడం పార్టీకి మైనస్ అని భావిస్తుంది. మళ్లీ అదే తప్పు చేసి మరోసారి టెన్షన్ పడటమెందుకని భావించిన అధినాయకత్వం అక్కడ సీఎంగా కొత్తవారిని నియమించాలని యోచిస్తోంది.
కసరత్తులు ప్రారంభించిన బీజేపీ....
ఇందులో ప్రముఖంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు విన్పిస్తుంది. స్మృతి మోడీ కోటరీలోని మనిషి. ఆమెకు చరిష్మా ఉంది. గుజరాతీలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే సమర్థత ఉంది. ఈ నేపథ్యలోనే స్మృతి ఇరానీని గుజరాత్ సీఎంగా పంపాలని మోడీ టీం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది కలిసి వచ్చే అంశంగా మోడీ సయితం భావిస్తున్నారు. అలాగే సౌరాష్ట్రకు చెందిన పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన మన్ సుఖ్ మాండవ్య పేరు కూడా విన్పిస్తోంది. అలాగే సీనియర్ నేత వాజూభాయ్ వాలా కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం విజయ్ రూపానీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీని ఇప్పుడు తప్పిస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎంగా అనుకున్న ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలు కావడంతో అక్కడ ముఖ్యమంత్రిగా ప్రస్తుత కేంద్రమంత్రి జేపీ నడ్డా పేరు బాగా విన్పిస్తుంది. అమిత్ సా నడ్డా పేరును దాదాపు ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
- Tags
- స్మృతి ఇరానీ

