స్టీరింగ్ తన చేతిలో పెట్టుకుని

ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటి పడిపోతున్నారు. ఉత్సాహపడిపోతున్నారు. తన తొలి ప్రయత్నానికే మంచి రెస్పాన్స్ రావడంతో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్రను పోషించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. స్టీరింగ్ తన చేతిలోనే ఉండేలా చూసుకునేందుకు అందరితో చర్చలు, సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు.....
దేశ రాజకీయాల్లో్ గుణాత్మకమైన మార్పును తీసుకురావాలన్నది కేసీఆర్ లక్ష్యం. ముఖ్యంగా రైతు సమస్యలను తీర్చలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే...లేకపోయినా ఒకటే అని చెబుతున్న కేసీఆర్ అదే అజెండాపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలవాలని కేసీఆర్ నిశ్చయించారు. ఇందుకోసం ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కత్తా, చెన్నై, బెంగళూరుల్లో పార్టీ నేతలతో సమావేశాలు జరపాలనుకుంటున్నారు. అయితే ఈ సమావేశాలు ఎప్పుడనేది ఖరారు కాకున్నప్పటికీ జరపడం ఖాయం. ఇందుకోసం అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చించి వారికి అనుకూలమైన సమయంలోనే సమావేశాలను ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ప్లాన్.
అన్ని వర్గాల వారితోనూ....
తన వద్ద ఉన్న ప్రణాళికనువారికి వివరించడంతో పాటుగా, వారి నుంచి రెండు జాతీయ పార్టీలకు భిన్నంగా ఏం చేయగలమన్న సలహాలను కూడా కేసీఆర్ స్వీకరించనున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు వివిధ ప్రజాసంఘాలతో కూడా కేసీఆర్ ఈ విషయమై చర్చించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, మాజీ ఫైనాస్స్ సెక్రటరీలు, మాజీ ఐపీఎస్, ఐఆర్ఎస్ లతో పాటు కార్మిక సంఘాల నేతలను కూడా కేసీఆర్ కలవాలని నిర్ణయించారు. వీరి సలహాలతోనే థర్డ్ ఫ్రంట్ విధివిధానాలను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. వీలయినంత త్వరగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల నేతలను కలవాలన్నది కూడా కేసీఆర్ ఆలోచన. మొత్తం మీద కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచనకు త్వరలోనే ఒక రూపును ఇస్తారని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు.
- Tags
- కేసీఆర్
