సోము వీర్రాజు వెనుక ఉంది ఎవరు ...?

బిజెపి ఏపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో టిడిపి పై చెలరేగిపోతున్నారు. ఇది ఆయన వ్యకిగతంగా చేసే వ్యాఖ్యలైతే కాదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటె బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో వున్న సోము వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఆయన భవితకు ఎసరు తప్పదు. మరి కోరి కోరి ఆయన అలాంటి రిస్కులు తీసుకునే ఛాన్స్ లేదన్నది పొలిటికల్ సర్కిల్స్ టాక్. గుజరాత్ ఎన్నికల విజయం తరువాత సోము వీర్రాజు గేర్ మార్చారు. అమరావతిలో ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ కానీ నిన్న మొన్నా నేడు చేస్తున్న వ్యాఖ్యలు హై కమాండ్ ఆదేశాల మేరకే సాగుతున్నాయి అన్నది తేలిపోతుంది. దీనివల్ల పార్టీకి రాబోయే ఎన్నికల్లో టిడిపితో పొత్తు సమయంలో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడమనే లక్ష్యం ఉందని, నయానా భయానా టిడిపి ని పూర్తిగా లొంగదీసి కుంగదీసేందుకే కమలనాధులు బహుళ వ్యూహాన్ని పసుపు దళంపై సోము రూపంలో ఒక అస్త్రాన్ని సంధించారన్నది అంచనా. ఒక్కసారి సోము తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశీలిద్దాం.
ప్రధాని బిసి కార్డు బయటకు తీసిన సోము ...
భారత ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి దూసుకుపోయేలా వ్యూహరచన చేస్తున్న బిసి మేధావి అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్యెల్సీ సోము వీర్రాజు అభివర్ణిస్తున్నారు. ఇలా ప్రధాని బిసి బిసి అంటూ ప్రతీ కార్యకర్తల సమావేశం లోను మీడియా సమావేశాల్లో వీర్రాజు ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. గుజరాత్ లోని కాండ్ల అనే చిన్న వెనుకబడిన కులంలో పుట్టి దేశ ప్రధానిగా దూసుకుపోవడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఇటీవల ఎన్నికల్లో నాలుగు కులాలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి రిజర్వేషన్ల పేరుతో నాటకం ఆడినా, నోట్ల రద్దు, జీఎస్టీ ల ప్రభావం ఉందంటూ మోడీ ఓడిపోతున్నారనే ప్రచారాన్ని తమ అనుకూల మీడియా లో గుప్పించినా దేశ హితాన్ని కోరి ప్రజలు కమలానికి పట్టం కట్టారని 2019 ఎన్నికల్లో అదే జరగబోతుందని జోస్యం చెప్పారు సోము. 1983, 1985 లలో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ ను 1989 లో ఒక కుల నేత హత్యను చూపి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుందని మోడీ విషయంలో ఆ పార్టీ ఏమి చేయలేక విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. మోడీ దమ్మున్న బిసి ప్రధాని అని బిసిలు ఆయన సాధిస్తున్న విజయాలకు పండగ చేసుకోవాలన్నారు.
అధికారంలోకి వస్తే ....
‘‘2014 ఏప్రిల్ 1 న భీమవరంలో బహిరంగ సభ జరుగుతుంది. ఇంతలో బిజెపి కి చెందిన సీనియర్ నాయకుడు నా దగ్గరకు వచ్చి రాష్ట్రంలో టిడిపి రెండుశాతం ఓట్ల తేడాతో వైఎస్ తనయుడిపై ఓడిపోయేలా వుంది అని చెప్పారు. దీనికి పరిష్కారం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనే కీలకమన్నారు. ఏడవతేది ఎన్నికలు. పవన్ ను ప్రధాని దగ్గరకు తీసుకువెళ్ళడం, టిడిపి కి ప్రచారం చేసేలా ఒప్పించడం జరిగాయి . ఈ అంశాలు బిజెపి ఎక్కడ చెప్పుకోలేదు . ఇందులో నా పాత్ర అందరికి తెలుసు .రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయే పార్టీ రెండుశాతం ఓట్లు అధికంగా తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సోము వీర్రాజును చాలామంది విమర్శిస్తున్నారు . టిడిపి ఎమ్యెల్సీ ఇచ్చినందుకు చంద్రబాబుకి రుణపడి ఉండాలంటున్నారు . ఆయన కాళ్ళకు మొక్కాలి అని చెబుతున్నారు. ఐస్ ఫ్రూట్ పార్టీ అంటున్నారు. ఇలా ఒకటేమిటి నానారకాలుగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు . కొవ్వు మదం ఎక్కి అధికారం రావడంతో ఇలా ప్రవర్తిస్తున్నారు. మట్టి , ఇసుక అమ్మేస్తున్నారు. గోదావరిలో రోడ్డులే నిర్మించి దోపిడీ చేస్తున్నారు .రూలింగ్ ట్రేడింగ్ గా మార్చేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు .
పవన్ కళ్యాణ్ కి చంద్రబాబే చెప్పాలి ....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కేంద్రం పై చేస్తున్న విమర్శలకు ఆయనను కూర్చోబెట్టి వివరించాలిసిన బాధ్యత చంద్రబాబు దే అంటున్నారు సోము. రాష్ట్రానికి హోదా ఇవ్వలేదంటున్నారు ప్రత్యేక ప్యాకేజీకి జైట్లీ దగ్గర బాబు అంగీకరించడం, దానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడాన్ని ఏపీ సీఎం పవన్ కి ఎందుకు పవన్ కి చెప్పరని నిలదీశారు. లక్ష కోట్ల రూపాయలు రోడ్లకు , 50 వేలకోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్ట్ , కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేసిన పోలవరం ముంపు మండలాలను ప్రధాని పదవి చేపట్టిన వెంటనే మోడీ చిత్తశుద్ధితో ఆర్డినెన్స్ ద్వారా కలిపిన అంశాలు ప్రజలకు వివరించాలని కార్యకర్తలను సమావేశాల్లో కోరారు సోము. కాంగ్రెస్ కేవీపీ ద్వారా నాటకాలు మొదలు పెట్టిందని కోర్ట్ లో రిట్ వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు.
ఎత్తిపోతలకే నానా గోలా చేసి ....
పోలవరం ప్రాజెక్ట్ 2019 కి పూర్తి చేస్తామని గడ్కరీ స్పష్టం చేశారు . పట్టిసీమ ద్వారా 100 టిఎంసిల నీరు తోడి నదుల అనుసంధానం పేరుతో రోజుకో కొబ్బరికాయ కొట్టి 10 వేలకోట్ల పంట పండించమని టిడిపి చెబుతుంది . పోలవరం కేంద్రం పూర్తి చేసి 500 ల టీఎంసీలు గ్రావిటీ మీద శాశ్వతంగా నీరిచ్చి 50 వేలకోట్ల పంట పండించబోతుంది ఇది ప్రజలకు చెప్పాలని వాట్స్ అప్ ఎలా వాడుతున్నారో ఓటర్ లిస్ట్ అలాగే కార్యకర్తలు అలవాటుగా మార్చుకుని పార్టీని బలపర్చాలన్నారు సోము వీర్రాజు .మోడీ ఇచ్చిన పిలుపుకి దేశంలో 2కోట్ల మంది తమ గ్యాస్ సబ్సిడీ వదిలేశారని ఒక బిసి ప్రధానిగా ప్రపంచ దేశాలు గడగడ లాడేలా భారత్ ను మోడీ ముందుకు తీసుకు వెళుతున్నారని కార్యకర్తలకు సోము వీర్రాజు దిశా నిర్ధేశనం చేస్తున్నారు. మోడీ విజయం , బిజెపి విజయమో ఆయన విజయమో కాదని దేశానికి విజయమని గుర్తించాలని పిలుపునిచ్చారు వీర్రాజు.
ఆయన టార్గెట్ అదేనా ...?
ఇలా బిజెపి కార్యకర్తల మోటివేషన్ క్లాస్ లు ఏపీలో చురుగ్గా సాగిస్తున్నారు కమల దళం . అందులోను ముఖ్యంగా సోము వీర్రాజు . కాంగ్రెస్ , బిజెపి లేదా ఏ ఇతర పార్టీ అయినా సొంత ఎజెండాతో నాయకులు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. పార్టీ వ్యూహం ప్రకారమే ఆయా పార్టీల్లో నేతల మాటలు ఉంటాయి . తన మాటలే తూటాలుగా మిత్రపక్షం పై ఎక్కుపెట్టిన సోము వీర్రాజు వెనుక ఖచ్చితంగా పార్టీ వ్యూహమే ఉందనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు .
- Tags
- సోము వీర్రాజు

