సోము కత్తి నూరేస్తున్నారు ...!!

టిడిపి పాటించిన మిత్ర ధర్మం పై ఏపీ లోని కమలం పార్టీ శ్రేణులకు వివరించే ప్రయత్నం లో బిజీ గా వున్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు. తమ పార్టీని అడుగడుగునా వెన్నుపోటు టిడిపి ఎలా పొడించిందో గణాంకాలతో క్యాడర్ ముందు విప్పేస్తూ కత్తి నూరుతున్నారు వీర్రాజు. అమరావతి, రాజమండ్రి, విజయనగరం ఇలా అన్ని ప్రాంతాలు విస్తృతంగా పర్యటిస్తూ చంద్రబాబు తీరును ప్రత్యేకంగా ఎండగట్టేస్తున్నారు ఆయన. తమ పార్టీ క్యాడర్ లో వున్న అపోహలను ప్రజల్లో బిజెపి కి వ్యతిరేకంగా పెరుగుతున్న భావనలను ఈ ప్రత్యేక ప్రచారం ద్వారా అడ్డుకోవాలన్నది సోము వ్యూహంలో కనిపిస్తుంది. అందులో భాగంగా టిడిపి బిజెపి మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా వున్నది ? మోడీ వచ్చాక ఎలా వున్నది ? అప్పుడు ఎలాంటి వెన్నుపోట్లు టిడిపి పొడించింది ఇప్పుడు ఎలా వెన్నుపోట్లు పొడిచింది వివరిస్తూ ఇదేనా తెలుగుదేశం మిత్ర ధర్మం అంటూ ప్రశ్నలు శరపరంపరగా సంధిస్తూ సాగిపోతున్నారు.
టిడిపి నుంచి సౌండ్ రావడం లేదే ...?
చంద్రబాబు బిజెపి మిత్ర ధర్మం పాటించడం లేదని అయినా తమవారిని కట్టడి చేస్తున్నా అని చెప్పాక ఆ పార్టీ నుంచి దూకుడు బాగా తగ్గింది. బిజెపి నేతలు మూడు ప్రాంతాల నుంచి ముప్పేట దాడి చేస్తూ తమ పార్టీకి టిడిపి చాలా అన్యాయం చేసిందని రాష్ట్రంలో అవినీతి పాలనే సాగుతోందంటూ ఎలుగెత్తి చాటుతున్న బాబు శిభిరం తాజా పరిణామాలను పరిశీలిస్తుంది కానీ ఎదురు దాడికి దిగడం లేదు. రాష్ట్రం కేంద్రం పై పూర్తి గా ఆధారపడిన నేపథ్యంతో బాటు మోడీ తో పెట్టుకుంటే అనే ఆలోచన టిడిపి ని వెనక్కి నెడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆచితూచి అడుగు వేయడమే మంచిదనే ధోరణి తో డిఫెన్స్ పాలిటిక్స్ ఆడేందుకే తమ్ముళ్లు సిద్ధమైనట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
విభజన హామీల పేరుతో స్వరం పెంచిన టిడిపి ...
పార్లమెంట్ కేంద్రంగా ఇప్పుడు విభజన హామీల పేరుతో ఆందోళనలు చేపట్టి బిజెపి ని ఇరుకున పెట్టేలా టిడిపి తన కొత్త వ్యూహం అమలు. చేస్తుంది. తాజాగా ఢిల్లీ లో తోట నరసింహం సారధ్యంలో అఖిల పక్షాన్ని నిర్వహించింది టిడిపి పార్లమెంటరీ పార్టీ. విభజన హామీలకు చట్టబద్ధత కల్పించాలని ఈ సమావేశంలో ఆ పార్టీ కోరడం విశేషం. గతంలో ప్యాకేజీకి చట్టబద్ధత అయిపోయిందన్న టిడిపి ఇప్పుడు ఆ మాట అవాస్తవమే అని అంగీకరించినట్లు అయ్యింది. సమావేశంలో పాల్గొన్న వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రత్యేక హోదా మాత్రమే ఏపీని ఆదుకోగలదని రైల్వే జోన్ తక్షణం ప్రకటించాలని వ్యవసాయ ఆధారిత ఏపీకి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుందంటూ ఇవన్నీ కేంద్రం దృష్టికి తెస్తామన్నారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మోడీ సర్కార్ పై టిడిపి యుద్ధం మొదలు పెట్టడం చర్చనీయాంశం గా మారింది. సుమారు నాలుగేళ్లు నిద్ర పోయి ఇప్పుడు టిడిపి వైసిపి లు రాజకీయ ఎత్తుగడలకే యుద్ధం ప్రారంభించాయా ? లేక రాష్ట్ర ప్రయోజనాల సాధనకా అన్నది వేచి చుడాలిసి వుంది.
- Tags
- సోము వీర్రాజు

