సోమిరెడ్డి కూడా వారసుడిని దించేశారే

సింహపురి జిల్లాలో సీనియర్ మంత్రి తన వారసుడిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు అధికారంలో ఉన్నప్పుడే వారసుడిని రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్వే పల్లి నియోజకవర్గం నుంచి తనకుమారుడు రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఆయన గత మూడేళ్ల నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో తన తండ్రి సోమిరెడ్డి వెంటే తిరుగుతున్నారు. ఇక సోమిరెడ్డి మంత్రి అయిన తర్వాత ఆ నియోజకవర్గ బాధ్యతలన్నింటినీ రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారు. కార్యకర్తలతో కలివిడిగా ఉండటం, సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను కనుక్కుని తక్షణం తీర్చడంలో రాజగోపాల్ రెడ్డి ముందుంటున్నారని సర్వేపల్లి టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
చురుగ్గా రాజగోపాల్ రెడ్డి.......
ఇక ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొనడం లేదు. మంత్రి కావడంతో ఆయన జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాని రాజగోపాల్ రెడ్డి మాత్రం సర్వేపల్లిలోనే ఉంటూ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు కూడా ఇటీవల సోమిరెడ్డి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి మంచి భవష్యత్ ఉందని చంద్రబాబు కితాబు కూడా ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని అభివృద్ది పనులను రాజగోపాల్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి పాల్గొంటున్నారు. మొత్తం మీద తన రాజకీయ వారసుడిని వచ్చే ఎన్నికల్లోనే బరిలోకి దించాలన్న సోమిరెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.

