సైకిలు కదలగానే పంచర్లు పడుతున్నాయే!

ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న సమాజ్ వాది జనతా పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కు పడుతున్నట్లుగా ఉంది. పార్టీలో ములాయం కుటుంబసభ్యుల మధ్య చెలరేగుతున్న వివాదాలు, ఆధిపత్యపోరాటాలు, అవి ఏ స్థాయికి శృతి మించుతున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. పైకి అందరూ ఎలాంటి విభేదాలు లేవు, అందరమూ కలిసే ఎన్నికలను ఎదుర్కొంటాం అంటూ సెలవిస్తూ వస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వికాస్ ఎన్నికల ప్రచారం నిమిత్తం వికాస్ రథయాత్రను ప్రారంభించారు. అయితే కుటుంబంలో ఉన్న అన్ని గ్రూపులు, ఆ గ్రూపుల మద్య కలహాలు సమస్తం.. ఈ వికాస్ రథయాత్ర ప్రారంభసభలోనే కనిపించడం విశేషం.
లక్నోలో యాత్ర ప్రారంభం చోటకే అఖిలేష్, శివపాల్ వర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ రెండు వర్గాలు పరస్పరం కలబడి కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పి.. శాంతింపజేశారు. అయితే ఇది చాలా చిన్నవిషయంగా అభివర్ణించిన అఖిలేష్ యాత్రను యథాతథంగా ప్రారంభించారు.
నివురుగప్పిన నిప్పు..
కుటుంబ కలహాలు ఎస్పీ పార్టీకి నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి. అఖిలేష్ రథయాత్రకు ములాయం సహకారం ఎంతమేరకు ఉంటుందనేది పెద్ద సందేహంగానూ ఉంది. అలాంటి నేపథ్యంలో.. వీలైనంత త్వరగా వీరంతా ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే.. కుటుంబ కలహాలే పార్టీ పుట్టి ముంచే పరిస్థితి ఏర్పడుతుందని అంతా అనుకుంటున్నారు.

