సుజనాకు అంతా రివర్స్ అవుతుందే?

టీడీపీ, బీజేపీ బంధం తెగిపోతుందని కొందరు తెగ సంబరపడిపోతుంటే మరికొందరు మాత్రం మదనపడిపోతున్నారు. ఇన్నాళ్లూ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో జట్టుకట్టినందున తమ తప్పులు బయటకు రాలేదు. ఇప్పుడు బయటకు వస్తే వాటిని తిరగదోడతారేమోనన్న భయం పట్టుకుంది. ఆయనే మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి. సుజనాచౌదరి కేంద్రమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత కూడా మోడీపైన, బీజేపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, అది ఇవ్వనందుకే తాము రాజీనామా చేసి వచ్చామంటూ సుజనా చెప్పుకొచ్చారు.
ఇష్టం లేకపోయినా.....
కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పుకోవడం సుజనాకు సుతారమూ ఇష్టంలేదు. కేంద్ర మంత్రిగా కొనసాగాలన్నదే ఆయన ఆలోచన. అయితే అధ్యక్షుడి ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితి. చివరకు అరుణ్ జైట్లీ మొన్న ప్రెస్ మీట్ పెట్టేముందు కూడా సుజనా చౌదరి కలిశారు. ఏపీకి న్యాయం చేయాలని, అటువంటి ప్రకటన చేస్తే బాగుంటుందని సూచించారు. కాని అరుణ్ జైట్లీ పూర్తిగా రివర్స్ లో వెళ్లారు. ఏపీకి న్యాయం చేస్తామని చెబుతూనే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారు. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలకున్న ప్రత్యేకత వేరంటూ సెటైర్లు కూడా వేశారు. దీంతో టీడీపీ కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
పాత కేసులను.....
సుజనా చౌదరిపై గతంలోనూ, ఇప్పుడూ కొన్ని ఆరోపణలుఉన్నాయి. మారిషన్ బ్యాంకులకు ఆయన సంస్థ అప్పులు ఎగ్గొట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఈవిషయంలో లీగల్ నోటీసులు అందుకున్నారు. అయితే కేంద్రమంత్రి వర్గంలో ఉండటంతో కొంత సేఫ్ గా ఉన్నారు సుజనా. ఇప్పుడు కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకోవడంతో పాత కేసులు మళ్లీ తిరగదోడతారేమోనన్న భయం పట్టుకుంది. ఇప్పటికే కార్తీ చిదంబరంపై పాత కేసులు తీసి అరెస్ట్ చేశారు. అదే విధంగా తనపై కూడా ఉన్న కేసులను బయటకు తీస్తారేమోనన్న ఆందోళనలో సుజనా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినా బీజేపీతో సయోధ్యగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? చూడాలి.
- Tags
- సుజనా చౌదరి
