సీనియర్లలో అలజడి రేపుతున్న రేవంత్

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ సీనియర్లకు తలనొప్పిగా మారింది. రేవంత్ చేరికతో సీనియర్లకు చెక్ పెట్టాల్సి వస్తుందా? అన్న అనుమానం బయలుదేరింది. రేవంత్ రెడ్డి నేరుగా రాహుల్ గాంధీని కలవడంతో వీరు ఏమీ చేయలేక మిన్నకుంటున్నారు కాని లేకుంటే బ్లాస్ట్ అయ్యేవాళ్లే. రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చిన లిస్ట్ తమకు తెలిసిందంటున్నారు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు. సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం మరో నియోజకవర్గాన్ని ఆయన వెదుకులాడుకుంటున్నారు. సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి పార్టీ అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
రేవంత్ జాబితాలో....
ఇక హుజూరాబాద్ నుంచి పీసీసీ అధ్చక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ పోటీ చేయాలనుకుంటున్నారు. సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ టిక్కెట్ కోసం ట్రై చేసుకుంటున్నాు. చొప్పదండి నుంచి సుద్దాల దేవయ్య మరోసారి పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆకుల లలిత, దేవరకొండ నుంచి లాల్ నాయక్, వరంగల్ నుంచి నాయని రాజేంద్రరెడ్డిలు టిక్కెట్ తమకేనన్న ధీమాలో ఉన్నారు. వీరు మూడున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నియోజకవర్గాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిని కాదని రేవంత్ రెడ్డి వెంట వచ్చే వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొందరు నేరుగా గాంధీ భవన్ కు వచ్చి ఉత్తమ్ నుంచి వివరణ తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాహుల్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాలో ఎక్కువగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలతో పాటు కొందరు సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల జాబితా కూడా ఉన్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు బయలుదేరాయి.
పాలమూరులోనూ.....
ఇక పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గం కూడా తన వెంట వచ్చిన వారికి ఇవ్వాలని రేవంత్ రాహుల్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే డీకే అరుణ మక్తల్ లో తనకుటుంబ సభ్యులను పోటీచేయించాలనుకుంటున్నారు. కాని రేవంత్ జాబితాలో మక్తల్ స్థానానికి కొత్తకోట దయాకర్ రెడ్డి పేరు ఉందని తెలియడంతో అరుణ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తం మీద రేవంత్ జాబితా కాంగ్రెస్ సీనియర్లలోనూ కొంత గందరగోళానికి తెరలేపింది. అయితే ఈ జాబితా రాహుల్ కు నిజంగా రేవంత్ ఇచ్చారా? లేక పార్టీలో జరుగుతున్న ప్రచారమా? అన్నది తేలాల్సి ఉంది.
- Tags
- రేవంత్ రెడ్డి

