సీనియర్ నేతలపై జగన్ సీరియస్

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఇరవై రోజులకు చేరుకుంది. అయితే పాదయాత్రలో ఉండగానే జగన్ కు ఇబ్బందులు తప్పడం లేదు. పాదయాత్రతో కాళ్లనొప్పులు ఒకవైపు వస్తుంటే... వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో తలనొప్పి కూడా వస్తోంది. ఇరవై రోజుల పాదయాత్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో జగన్ మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ముఖ్యంగా వంతల రాజేశ్వరి వెళ్లినప్పుడు పెద్దగా జగన్ పట్టించుకోలేదు. కేవలం ప్రలోభాలకు లొంగి మాత్రమే వెళ్లారని జగన్ కూడా భావించారు. అయితే గిడ్డిఈశ్వరి విషయంలో మాత్రం జగన్ సీనియర్ నేతలపై సీరియస్ అయినట్లు తెలిసింది. గిడ్డి ఈశ్వరి తొలి నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆమె పార్టీని వీడతారని జగన్ సయితం ఊహించలేదు. గిడ్డి ఈశ్వరి వెళ్లడానికి సీనియర్ నేతలే కారణమని జగన్ వారిపై ఫైర్ అయ్యారు. సున్నితమైన అంశాన్ని డీల్ చేయకపోతే ఎలా అని జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉండగా ఏకపక్ష ధోరణిని ఎలా అవలంబిస్తారని ముఖ్యంగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం...?
మరోవైపు జగన్ పత్తికొండ నియోజకవర్గం నుంచి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. నిన్న ఆయన 16.3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడులో నిన్న రాత్రి బస చేశారు. నేడు అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభం కానుంది. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, బహిరంగ సభలు, ముఖాముఖి కార్యక్రమాల్లో జగన్ బిజీగానే ఉన్నా... మిగిలిన వారిని వెళ్లకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేలు కొందరితో స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలందరూ పాదయాత్రకు చేరుకునేలా కూడా వైసీపీ సీనియర్లు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో రెండు, మూడు రోజుల్లో పాదయాత్ర వద్దనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తున్నా... ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.
- Tags
- జగన్

