సీనియర్ నేతల సమావేశంలో జగన్ తీవ్ర అసంతృప్తి

వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం పార్టీ సీనియర్ నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పాదయాత్రపై చర్చించినట్లు తెలుస్తోంది. పాదయాత్రకు జరుగుతున్న ఏర్పాట్లు, పాదయాత్రలో ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశాలను జగన్ సీనియర్ నేతలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, నిరుద్యోగం, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలపై పాదయాత్రలో ఎక్కువగా ప్రస్తావించాలని నిర్ణయించారు. దీంతో పాటుగా నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను కూడా రూపొందించి సిద్ధం చేయాలని చెప్పారు. ఆ నియోజకవర్గంలో ఆ సమస్యలను ప్రస్తావిస్తే ప్రజలకు కొంత చేరువవుతామని, ఆ సమస్యల పరిష్కారం గురించి కూడా జగన్ పాదయాత్రలో మాట్లాడతారు.
నిర్ణయాలు బయటకు వెళ్తున్నాయి......
అలాగే పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి తెలుస్తుండటంపై కూడా జగన్ కొంత ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. వైసీపీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలతోపాటు తాము తీసుకోబోతున్న నిర్ణయాలు కూడా టీడీపీకి చేరుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. పార్టీ సీనియర్ నేతలు కాకుండా అనుబంధ సంఘాల నేతలు ఎవరెవరున్నారన్న దానిపై జగన్ ఆరా తీశారు. తాము సమావేశాల్లో అనుకున్నవన్నీ చంద్రబాబుకు చేరుతున్నాయని, వాటిని వెంటనే ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇకపై అలా జరగకుండా చూసుకోవాలన్నారు. అయితే కీలక నిర్ణయాలను సీనియర్ నేతలతోనే పంచుకోవాలని కొందరు జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సమావేశంలో పాదయాత్రపైనే ఎక్కువగా జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
- Tags
- జగన్

