సీకే బాబుకు ఈపార్టీ గాలం?

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై బీజేపీ వల వేస్తుందా? గెలిచే సత్తా ఉన్న నేత కావడంతో ఆయనకు కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. చిత్తూరులో సీకే బాబుకు పట్టుంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీకేబాబు చిత్తూరును కంచుకోటగా మలచుకున్నారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సీకే బాబును తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరకు తీశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీకే బాబు వైసీపీలో చేరారు. అయితే టిక్కెట్ దక్కలేదు. అప్పుడు వైసీపీ అధినేత జగన్ సీకే బాబుకు కాకుండా జంగాలపల్లి శ్రీనివాస్ కు టిక్కెట్ కేటాయించారు. అయినా సీకే బాబు శ్రీనివాస్ కోసం కష్టపడ్డారు. అయినా ఫలితం లేదు. అయితే తాజా పరిణామాలు సీకే బాబును వైసీపీ నేత కాదని ఆ పార్టీ స్పష్టం చేసింది. సీకే బాబును జగన్ దూరం చేసుకున్నట్లే అయింది.
కాషాయ కండువా కప్పుకుంటారా?
ఈనేపథ్యంలో సీకే బాబు మరోసారి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల అనుచరులతో సమావేశమై అందుకు అవసరమైన చర్చలు జరిపారు. అయితే తాజాగా బీజేపీ నేత పురంద్రీశ్వరి సీకేబాబు ఇంటికి వెళ్లి కలవడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న చిత్తూరును వదులుకునేందుకు సహజంగానే సీకేబాబు అంగీకరించారు. ఏ పార్టీ అండ లేకపోయినా తాను స్వతంత్రంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో పురంద్రీశ్వరి స్వయంగా వెళ్లి సీకే బాబును పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సీకే బాబు ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. తన అనుచరులతో సమావేశమై చెబుతానని మాత్రమే పురంధ్రీశ్వరితో చెప్పారు. మొత్తం మీద సీకే బాబు వైసీపీకి అవసరం లేకపోయినా... ఆయనను కమలం పార్టీ గుర్తించిందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.
- Tags
- సీకేబాబు

