సీఎం బ్లాక్ భద్రతను ప్రశ్నించడం కరక్టేనా?

రాజకీయ విమర్శలు చేసే సమయంలో నాయకులు కాస్త అదుపు పాటించాలి. తమ విజ్ఞత ప్రదర్శించాలి. అంతే తప్ప.. ఏది తోస్తే అది మాట్లాడేస్తూ ఉంటే.. వారి గురించి జనానికి పలుచన అభిప్రాయం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. బుధవారం నాడు వైకాపా నాయకుడు పార్థసారధికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. విధానాల మీద ఎంతగా పోరాడినా ప్రజాదరణ దక్కుతుంది గానీ.. అనవసరపు అంశాలను ప్రస్తావించే కొిద్దీ తమ మాటల్లో తీవ్రత పలుచన అయిపోతుందని నాయకులు తెలుసుకోవాలి.
వెలగపూడిలో చంద్రబాబునాయుడు తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ప్రెస్ మీట్ ముగించిన కొద్దిసేపటికే వైకాపా నాయకుడు అధికార ప్రతినిధి పార్థసారధి ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. రాకెట్ లాంచర్లతో దాడులు జరిగినా కూడా చెక్కు చెదరనంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో సీఎం కార్యాలయ బ్లాక్ నిర్మాణం జరిగిందనే వార్తలు చూస్తోంటే.. రాష్ట్రంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ.. పార్థసారధి తనదైన శైలిలో భాష్యం చెప్పడానికి ప్రయత్నించారు. రాకెట్ లాంచర్లను కూడా తట్టుకునేలా ఎందుకు నిర్మిస్తున్నారో చంద్రబాబు ముందుగా ప్రజలకు వివరణ ఇవ్వాలని పార్థసారధి డిమాండ్ చేశారు. ఇంతకూ పార్థసారధి ఆవేదన ఏంటంటే.. అదనపు హంగుల పేరితో అదనపు కమిషన్లు దండుకోవడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారట.!!
అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి రక్షణ ఏర్పాట్ల గురించి ఇలా అడ్డదిడ్డంగా ప్రశ్నించడం అనేది జనం దృష్టిలో వివేకమైన చర్యగా కనిపించడం లేదు. ‘‘జగన్ తన చుట్టూ బౌన్సర్లను పెట్టుకుని, పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకుని ఎందుకు తిరుగుతారు? జగన్ పర్సనల్ సెక్యూరిటీని చూసి జనం భయపడిపోతున్నారు!’’ లాంటి విమర్శలు చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. సీఎం కార్యాలయ భద్రతను ప్రశ్నించడం కూడా అలాగే ఉంటుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే ఆఫీసు అంటే.. ఖచ్చితంగా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు ఉండాల్సిందే.. ఎలాంటి అతి వాదులు కార్యాలయం మీద చిన్న రాయివిసిరినా అది చాలా పెద్ద సంచలనం అవుతుంది గనుక.. ఏర్పాట్ల పరంగా లోపం ఉండకూడదు. అయినా బాధ్యతాయుతమైన విపక్షం హోదాను అనుభవిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాసంక్షేమం దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటే వాటిని ఎండగట్టి గాడిలో పెట్టాల్సింది పోయి.. ఇలా భవనాల్లో భద్రత గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

