సీఎం కొత్త పేరు ‘తొలిసంతకం చంద్రబాబు’ !!

నారా చంద్రబాబునాయుడు అనే పేరు మారిపోయి ‘తొలిసంతకం’ చంద్రబాబునాయుడు అనే పేరు వస్తుందిట. ఈ విషయం ఆయనను వ్యతిరేకించే విపక్షాల వారు చేసిన ఆరోపణే గానీ.. ఆయన పదేపదే తొలిసంతకాలు చేస్తూ ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. వెలగపూడి సీఎం కార్యాలయంలో డ్వాక్రామహిళలకు రెండో విడత సాయం అందించే ఫైలు మీద ముఖ్యమంత్రి తొలిసంతకం చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే రెండున్నరేళ్ల పాలనకాలం దాటుకుని ముందుకు వచ్చిన తర్వాత ఇప్పటికి చేస్తున్న సంతకాలను కూడా ‘తొలిసంతకం’ అంటూ చెప్పుకోవడాన్ని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజానాధ్ తప్పుబట్టారు. ‘‘షాహుకారు జానకి తరహాలో వారి ధోరణులే వారికి ఇంటిపేరుగా మారిపోయిన తరహాలో, చంద్రబాబుకు ‘తొలిసంతకం’ అనేది ఇంటి పేరు అవుతుందంటూ శైలజానాధ్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంతకాలను తొలిసంతకం అన్నారని, తర్వాత ఇదే సీఎం బ్లాకును ఇదివరకు ఒకసారి ప్రారంభించి.. అప్పట్లో ఒక తొలిసంతకం చేశారని, బుధవారం నాడు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన దానిని మళ్లీ తొలిసంతకం అంటున్నారని, మళ్లీ 20 వ తేదీన మరోసారి చంద్రబాబు ఆఫీసులో గృహప్రవేశం చేసి మళ్లీ తొలిసంతకం అంటారని శైలజా చెప్పుకొచ్చారు.
పరిపాలనలో భాగంగా చేసే పనులను, ఎన్నికలకు ముందు నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తెస్తున్నప్పుడు ప్రతిదానికీ ‘తొలిసంతకం’ అంటూ ప్రచారం చేసుకోవడం చంద్రబాబునాయుడుకు ఒక అలవాటుగా మారిపోయిందని శైలజానాధ్ ఎద్దేవా చేశారు.
అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన కొత్త - సీఎం కార్యాలయాన్ని ప్రారంభించి.. అవినీతి, బ్లాక్ మనీ, ఎన్నికల్లో అవినీతి ఇలాంటి అనేక విషయాలను గురించి చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా మాట్లాడితే.. కాంగ్రెస్ నాయకులు అసలు కీలకాంశాలన్నీ వదిలేసి.. తొలిసంతకం అనే మాట ఒక్కదానినే పట్టుకుని ఎద్దేవా చేయడం చిత్రంగానే ఉంది.

