సిరీస్ సరే.. చారిత్రాత్మక విజయమే విశేషం!

న్యూజీలాండ్ చరిత్రలో ఇంత ఘోరమైన పరాభవం వారికి ఎన్నడూ ఎదురు కాలేదు. సెకండ్ బ్యాటింగ్కు దిగి, 190 పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది వారి చరిత్రలో లేదు. కివీస్ జట్టు పాపం.. సరిగ్గా వంద నిమిషాలు కూడా క్రీజులో నిలబడలేదు. 23 ఓవర్లు గడిచేసరికి వారి ప్రస్థానం ముగిసిపోయింది. మన స్పిన్ బౌలర్ల మాయాజాలానికి వారు 79 పరుగులకే కుప్పకూలారు. కివీస్ జట్టులో ఏకంగా అయిదుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయిదు వన్డేల సిరీస్ లో చెరి రెండు గెలిచిన తర్వాత.. విశాఖ వన్డే ఇరు దేశాలకు చాలా కీలకంగా మారింది. విశాఖ మన జట్టుకు లక్కీ పిచ్ గా పేరున్నప్పటికీ .. ఎవ్వరూ ఆషామాషీగా తీసుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన.. భారత్ 269 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 70, కొహ్లి 65, ధోనీ 41, జాదవ్ 39 పరుగులతో జట్టు మంచి స్కోరు సాధించడానికి కారకులయ్యారు. కివీస్ జట్టు బ్యాటింగ్ కు దిగిన తర్వాత మన వాళ్ల మాయాజాలం ప్రారంభం అయింది. అమిత్ మిశ్రా ఏకంగా 5 వికెట్లు తీశాడంటే పిచ్ స్పిన్ కు ఎంతగా సహకరించిందో అర్థం అవుతుంది. మన వారి ధాటికి 23.1 ఓవర్లకే కివీస్ కుప్పకూలింది. వారికి చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరమైన ఓటమి దక్కింది. భారత్ అటు టెస్ట్, ఇటు వన్డే సిరీస్ లను కూడా గెలుచుకుని తమకు తిరుగులేదని చాటుకుంది.

