సిద్ధూకూ జై అంటున్న కన్నడ ఓటర్లు..తాజా సర్వే

కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మరో సర్వే తేల్చింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వే ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో ఆనందం నింపాయనే చెప్పాలి. సిద్ధరామయ్య సర్కార్ పనితీరు పట్ల కన్నడ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సర్వేలో పది మార్కులకు గాను సిద్ధూకు 7.09 మార్కులు వచ్చాయన్నమాట. ది అసోసియఏసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, దక్ష్ లేనే స్వచ్ఛంద సంస్థలు ఈ సర్వేను నిర్వహించాయి. మొత్తం 225 నియోజకవర్గాల్లో 13,244 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఈ సర్వే గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో....
సర్కార్ పనితీరుపైనే ఈ సర్వే ప్రధానంగా సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్వేలో ఓటర్లు ప్రభుత్వం బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. పాఠశాలల నిర్వహణలో 7.58 , విద్యుత్తు సరఫరాలో 7.56, నిత్యావసరాల పంపిణీలో 7.35, మార్కులు సిద్ధూ సర్కార్ కు వేశారు. ఉపాధి కల్పనలో 6.70, అవినీతి నిర్మూలనలో 6.67, ఉద్యోగ శిక్షణలో 6.60 మార్కులు వేశారు. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో సిద్దరామయ్య ప్రభుత్వానికి పది మార్కులకు గాను 7.05 మార్కులు పడ్డాయి.
పట్టణ ప్రాంతాల్లో.....
ఇక పట్టణ ప్రాంత ఓటర్లు కూడా కాంగ్రెస్ సర్కార్ పనితీరును మెచ్చుకున్నారు. పాఠశాలల నిర్వహణలో 7.85, విద్యుత్తు సరఫరాలో 7.83, ప్రజా రవాణా వ్యవస్థ లో 7.61, సేవల విషయంలో 6.79, అవినీతి నిర్మూలనలో 6.77, ఉపాధి శిక్షణలో 6.40 మార్కులు పడ్డాయి. 67 శాతం మంది పార్టీతో పాటు అభ్యర్థిని చూసి ఓటేస్తామని చెప్పారు. 86 శాతం మంది మంచి అభ్యర్థే ప్రధానమని చెప్పారు. 42 శాతం మంది సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్న పార్టీనే ఎన్నుకుంటామని చెప్పారు. మొత్తం మీద సిద్ధరామయ్య సర్కార్ కు ఎన్నికలకు ముందు ఈ సర్వే శుభవార్త నందించిందనే చెప్పాలి.
