సిద్ధూ రోజుకో గూగ్లీ వేస్తున్నారే

కర్ణాటక ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు రెండూ అధికారం కోసం అన్ని దారులూ వెతుకుతున్నాయి. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని రెండు పార్టీలూ వదులుకోవడం లేదు. ఈ ఏడాదిలోనే కర్ణాటక విధాన సభకు ఎన్నికలు జరగుతుండటంతో అప్పుడే ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో అలుముకుంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి బీజేపీని దక్షిణాదిన లేకుండా చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీని ఇబ్బందిపెట్టేందుకు వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించేందుకు ప్రభుత్వం సిద్దమయింది. వారికి మతపరమైన మైనారిటీ హోదాను కూడా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేసిన రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫార్సులను సిద్ధరామయ్య సర్కార్ ఆమోదించింది.
కేంద్రం కోర్టులో బంతి....
ఈ సిఫార్సులను కేంద్రానికి పంపడం ద్వారా బంతిని కేంద్రంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో సిద్ధరామయ్య ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిని వీర శైవులు వ్యతిరేకిస్తున్నారు. అయినా కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం లింగాయత్ లు కావడంతో వారి ప్రాపకం పొందేందుకు సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ మాత్రం రాజకీయ అవసరాల కోసమే సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు చేస్తోంది. ప్రజలను విభజించి అధికారంలోకి రావడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాంగ్రెస్ నిర్ణయం బీజేపీకి ఇబ్బందిగా మారింది.
వంద నియోజకవర్గాల్లో ప్రభావం....
కర్ణాటకలో లింగాయత్ లు 17 శాతం మంది ఉన్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీలూ గత కొంతకాలంగా హామీలు గుప్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా లింగాయత్ లు తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్నది కూడా వారి ప్రధాన డిమాండ్. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వారి డిమాండ్ మరింత ఊపందుకుంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం నాగ మోహన దాస్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించిన తర్వాత కమిటీ సిఫార్సులను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. లింగాయత్ లు వంద నియెజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించగలగడంతో ప్రభుత్వం వారి డిమాండ్ కు సానుకూలంగా స్పందించింది. మరి ఎన్నికల సమయంలో వీరు ఎవరికి అండగా నిలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం.
- Tags
- కర్ణాటక ఎన్నికలు
