సిద్ధూ...జెండా..ఎజెండా ఒక్కటే?

ఎక్కడైనా రాజకీయ నాయకులది ఒక్కటే బాట. అదే సెంటిమెంట్. ప్రజల్లో ఉన్న బలమైన సెంటిమెంట్ ను రాజకీయాల్లోకి వాడుకోవడం ఎక్కడైనా చూసేదే. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది అన్ని పార్టీల లక్ష్యం. ఇందులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు వరుసలో ఉన్నారని చెప్పక తప్పదు. స్థానికులకే కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆందోళన జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్లు స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్నది అక్కడ ప్రజల డిమాండ్. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల ఎదుట కన్నడ భాషలోనే బోర్డులు ఉండాలన్న నినాదం ఊపందుకోవడంతో సిద్ధరామయ్య అందుకు ఓకే చెప్పేశారు.
సెంటిమెంట్ తో....
ఇక ప్రత్యేక జెండా విషయంలో సిద్ధరామయ్య ముందడుగు వేశారు. ఎప్పటి నుంచో కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉండాలన్న వాదన ఉంది. దీనిపై అనేక సంఘాలు ఆందోళన కూడా నిర్వహించాయి. దీంతో సిద్ధరామయ్య కన్నడ రాష్ట్రానికి ప్రత్యేక జెండాను రూపొందించారు. ఆవిష్కరించారు కూడా. ఎరుపు, పసుపు, తెలుపు రంగులతో ఉండే జెండాను సిద్ధరామయ్య ఆవిష్కరించారు. కన్నడ రాష్ట్రానికి ప్రత్యేక జెండా అవసరమని విన్పిస్తున్న వాదనతో ఏకీభవించిన సిద్ధరామయ్య జెండా రూపకల్పనకు నిపుణులు, సాహితీ వేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులతో కమిటీని రూపొందించి జెండాను ఖరారు చేశారు.
ప్రత్యేక జెండాతో ప్రజల వద్దకు...
అయితే ఈ జెండా కన్నడిగుల ఆకాంక్షను నెరవేరుస్తుందని సిద్ధరామయ్య ప్రకటించారు. తమ జెండాకు అధికారికంగా ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. సిద్ధరామయ్య ఈ జెండా ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఈ ఏడాది లోనే కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధూ సెంటిమెంట్ తో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. సిద్ధరామయ్య అవినీతిపరుడంటూ ఎండగడుతోంది. వీటన్నింటి నుంచి దృష్టి మళ్లించడానికి సిద్ధరామయ్య జెండాను ఆవిష్కరించారు.
ఎలాగైనా గెలిచి తీరాలని....
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రెండుసార్లు పర్యటించి వెళ్లారు. తమకు బలంగా ఉన్న కర్ణాటకలో పాగా వేసి 2019 లోక్ సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. సిద్ధరామయ్య సర్కార్ పై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ ఈశాన్య రాష్ట్రాల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీని చూసి కొంత కలవరపాటుకు గురవుతున్న మాట వాస్తవమే. అందుకే సిద్ధరామయ్య ప్రజల సెంటిమెంట్ ను బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిద్ధూ ఈజెండాతో కన్నడనాట పాగా వేస్తారో లేదో చూడాలి.
- Tags
- సిద్ధరామయ్య
