సలహాదారులు ఎక్కువయ్యారే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనంత ఆయనే నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నదానికి కేసీఆర్ చిరునామా అంటారు. అలాంటి కేసీఆర్ సర్కార్ లో సలహాదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీరి నియామకాలతో ఖాజానాపై భారం కూడా పడుతోంది. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సలహాదారులు 12 మందికి చేరుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మతో పాటు మరో తొమ్మిది మంది ప్రభుత్వ సలహాదారులుండగా, మరో ముగ్గురు ఢిల్లీలో సలహాదారులుగా నియమితులయ్యారు.
నెలకు మూడు కోట్లకు పైగానే....
ప్రభుత్వ ముఖ్య సలహాదారులకు నెలకు 2.50 లక్షల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇతర సౌకర్యాలు వీరికి అదనం. ఇక మిగిలిన సలహాదారులకు నెలకు లక్ష రూపాయలు గౌరవ వేతనం కాగా ఇంటి అద్దె కోసం యాభై వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇతర ఖర్చులకు ముఫ్పయి వేలు, వాహనం ఇంధన ఖర్చుల కింద మరో పదిహేనువేలు చెల్లిస్తుంది. ఇలా సలహాదారులకు ప్రతి నెలా కోట్ల రూపాయలు గౌరవ వేతనం, ఇతర సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే ప్రభుత్వ సలహాదారు వివేక్ మాత్రం ప్రభుత్వం నుంచి పైసా కూడా తీసుకోవడం లేదు.
వాస్తు దోషాలను పరిశీలించేందుకు....
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే ఆరుగురిని ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా ఆరుగురిని నియమించింది. విద్యాసాగరరావును నీటిపారుదల శాఖలో సలహాదారుగా నియమించారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి, పాపారావు, గోయల్, రాం లక్ష్మణ్, ఎకే ఖాన్, వివేక్, అనురాగ శర్మ, సుద్దాల సుధాకర్ తేజ, జీఆర్ రెడ్డి లను కూడా సలహాదారులుగా నియమించారు. ఢిల్లీలో వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్, సాహ్నిలు ప్రభుత్వ సలహాదారులగా ఉన్నారు. వీరందరినీ నియమించిన కేసీఆర్ సుద్దాల సుధాకర్ తేజను మాత్రం తెలంగాణలో ప్రభుత్వం నిర్మించే భవనాలకు వాస్తు సలహాలిచ్చేందుకే నియమించడం విశేషం. వీరితో పాటు కొన్నాళ్లపాటు డి.శ్రీనివాస్ ను కూడా గౌరవ సలహాదారుగా నియమించారు. మొత్తం మీద కేసీఆర్ కు సలహాలిచ్చే వారి సంఖ్య ఎక్కువయ్యారని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.
- Tags
- సలహాదారులు
