సరదాకి : మహా టీవీ వ్యవహారం ... మరీ ఘోరం!

పత్రికల్లో వచ్చే అప్పుతచ్చులను సారీ.. అచ్చుతప్పులను ముద్రారాక్షసాలు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే అదంతా పొరబాటుగా దొర్లే అక్షరదోషాలకు సంబంధించిన వ్యవహారం కానీ.. ఆధునిక మీడియా ప్రపంచంలో పోటీ వాతావరణం ఎలా తయారైందంటే.. సంఘటన జరిగిందంటే.. వాస్తవాల్ని తెలుసుకోకుండానే.. విషయాల్ని ప్రచారంలో పెట్టేయడం.. ఆ తర్వాత నెమ్మదిగా తప్పులను దిద్దుకుంటూ ముందుకు సాగడం ప్రధానంగా టీవీ ఛానెళ్లకు సర్వసాధారణం అయిపోయింది. ఓ ప్రముఖుడు ఆస్పత్రికి వెళితే చాలు.. ‘ఆయన పరిస్థితి విషమం’ అని ఒకరు వేస్తే... మనం ఎడ్వాన్స్డ్ గా ఉండాలనే యావలో ‘ఆయన మరణం’ అంటూ మరొకరు వేసేస్తున్నారు. అసలే సంగతీ ధ్రువీకరించుకోకుండానే ఇలాంటివి జరుగుతున్నాయి. సినీ ప్రముఖులు ఎమ్మెస్, మల్లికార్జునరావు, వేణుమాధవ్ లాంటి వారి విషయంలో ఇలాంటి తప్పిదాలు ఎన్నెన్ని జరిగాయో మనకు తెలుసు.
అయితే జయలలిత మరణం అనంతర బ్రేకింగ్ న్యూస్ లు ఇచ్చే క్రమంలో భాగంగా.. మహా టీవీ వారు అంతకంటె ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు. పత్రికల్లో ముద్రారాక్షసం అన్నట్లుగా టీవీ గనుక.. దీనిని ‘బ్రేకింగ్ రాక్షసం’ అనాలేమో.
‘‘జగన్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం’’ అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేశారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మహా టీవీ చూసి న్యూస్ తెలుసుకోగోరే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది గనుక.. ఈ తప్పిదం అంత త్వరగా ప్రజల్లోకి వెళ్లలేదు. కొన్ని గంటలపాటూ అదే తప్పు యథేచ్ఛగా బ్రేకింగ్ న్యూస్ కింద చెలామణీ అయింది. తర్వాత జిల్లాల్లోని విలేకర్లు ఎవరో గమనించి.. అలర్ట్ చేయడంతో దిద్దుకున్నారు. అయినా జయలలిత అని టైపు చేయవలసిన స్థానే జగన్ అని కొట్టేసి.. ఎంత పొరబాటు చేశారో.. కనీసం ఆ మహా టీవీ వారు ఏదో ఒక బులెటిన్ లో క్షమాపణ చెప్పి ఉంటే అయినా బాగుండేది.

