సత్తా ఉండగా పొత్తుల గురించి ఆలోచన ఎందుకు : కేసీఆర్

దేశ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తెలంగాణ రాష్ట్రంలోనే తాను ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన అనేక విషయాలు చెప్పారు. తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లబోమన్నారు. స్వతంత్రంగానే ఎన్నికలకు వెళతామని చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన కుటుంబ సభ్యులే ఉన్నారనడాన్ని ఆయన తప్పు పట్టారు. తన పిల్లలు ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచారన్నారు. ఉద్యమ సమయంలో తన వారసులు జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ తన కుటుంమేనని తెలిపారు. ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసమని, అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరన్నారు. కేసీఆర్ తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రలు వస్తారని చెప్పారు.
ఏపీకి, తెలంగాణకు పోలికే లేదు....
ఏపీకి తెలంగాణకు అస్సలు పోలికే లేదన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని చెప్పారు. మద్రాస్ రాష్ట్రం ఉండగానే హైదరాబాద్ లో ఎయిర్ పోర్టులున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ అనేక సంస్కృతులకు నిలయమన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ లో చెరువులను కొందరు ధ్వసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించడమే తమ లక్ష్యమన్నారు. నీటిపారుదల రంగంలో అద్భుతాలు సృష్టించామని చెప్పారు.
రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి స్వేచ్ఛ ఉండాలి.....
గుజరాత్ కన్నా దేనిలోనూ తెలంగాణ తీసిపోదన్నారు. భౌగోళికంగా కూడా బీహార్, బెంగాల్ కన్నా తెలంగాణ పెద్ద రాష్ట్రమని తెలిపారు. రైతుల సంక్షేమమే థ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. రైతుల కోసం పెట్టుబడి పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. ఎకారానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడిని ఇవ్వనున్నామన్నారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఉండాలన్నారు. యాభై శాతం రిజర్వేషన్లు ఏమాత్రం సరిపోవని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, దీనిపై పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికోసమే రిజర్వేషన్లు అమలుపర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆరు నెల్లలోనే విద్యుత్తు సంక్షోభం నుంచి బయటపడగలిగామని, ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్తును అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు. త్వరలోనే తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- కేసీఆర్

