సంపదపేరుతో షో బిజినెస్ : తూచ్ అనేసిన ఐటీ!

హీరోయిన్ ముందు బిల్డప్ ఇవ్వడానికి హీరో అపరకుబేరుడిలాగా కల్లబొల్లి కబుర్ల డైలాగులు వల్లించడం.. ప్యారిస్ లో బ్రేక్ఫాస్ట్ చేసి, న్యూయార్క్ లో లంచ్ చేసి, సింగపూర్ లో డిన్నర్ చేసేంత బిజీ రిచ్ పర్సన్ అంటూ కోతలు కోయడం .. ఇలాంటి సన్నివేశాలు మనకు అనేక సినిమాల్లో తారసిల్లుతాయి. కానీ వాస్తవంలో సంపద ఉన్నవారు.. పేదరికం నటించడం చూస్తాం తప్ప.. భారీ బిల్డప్ లు అరుదు. లేని సంపదను భూతద్దంలో చూపించుకోవడం.. ఏదో పెళ్లి సంబంధాల విషయంలో కొందరు బురిడీ కొట్టిస్తుంటారేమో గానీ.. సాక్షాత్తూ ఐటీ వద్దకెళ్లి.. అబద్ధం చెప్పే సాహసం ఎవరికుంటుంది? ఈ అంచనాలన్నీ ఎలా ఉన్నా.. ముంబాయిలోని ఓ కుటుంబం మాత్రం ఐటీ శాఖ వారి వద్దకెళ్లి.. ‘‘మేం అపర కుబేరులం.. మా వద్ద ఉన్న నల్లధనం విలువ 2 లక్షల కోట్లు . స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నాం.. అనుగుణంగా పెనాల్టీలు వేయండి’’ అని అడిగేసరికి.. పాపం ఐటీ అధికారులు బిక్కచచ్చిపోయారు.
ఆ తర్వాత.. ‘తూచ్ మీకంత సీన్లేదు.. చాల్లే ఇంక ఇంటికి పదండి’ అంటూ వారిని సాగనంపారు.
నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకం కార్యక్రమాల్లో వెలుగు చూసిన విలక్షణమైన ఘటనల్లో ఇదొక కామెడీ. ఇప్పటికే మహేష్ షా వ్యవహారం.. ఆసక్తికర చర్చగా నడుస్తోంది. అదైనా ఏదో 13వేల కోట్ల రూపాయలతో ముగిసిపోయింది. కానీ ముంబాయిలోని ఈ నలుగురు సభ్యుల కుటుంబం .. తమ నల్లధనం ఏకంగా రెండు లక్షల కోట్లు ఉన్నదని చెప్పేసరికి.. ఖంగుతిన్న ఐటీ అధికారులు , వారి మధ్యతరగతి వ్యవహారం గమనించిన తర్వాత.. డాంబికాలు చాల్లే ఇంటికి పదండి అంటూ వారిని సాగనంపారు.
ఇన్కం టాక్స్ అధికారి మీనాక్షి గోస్వామి కథనం ప్రకారం.. వారు ముంబాయిలోని ఐటీ కార్యాలయానికి వచ్చి.. తమ సంపద గురించి వెల్లడించారు. ‘ఈ వ్యవహారమే అనుమానాస్పదంగా కనిపించడంతో రికార్డుల్లోకి పరిగణించలేదు’ అని ఆమె వెల్లడించారు.
ఇంతకూ ఆ కుటుంబంలో అంతా కలిపి అబ్దుల్ రజాక్ ఎం. సయీద్ (యజమాని) , భార్య రుక్సానా, కొడుకు మహమ్మద్ ఆరిఫ్, సోదరి నూర్జహాన్ మహమ్మద్ సయీద్ మాత్రమే ఉన్నారు. ఇంతా కలిపి తమ నల్లధనమే అంత ఉన్నదని వెల్లడించిన రజాక్.. తాను చేసే వ్యాపారం ఏంటో.. డబ్బు ఎక్కడిదో మాత్రం అధికార్లకు చెప్పలేకపోయాడు. ఈ కుటుంబం వెస్ట్ బాంద్రాలో రెండున్నర కోట్లు విలువ చేసే ఓ సాధారణమైన మిడిల్ క్లాస్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుందిట. అయితే రజాక్ ఇలా వెల్లడించడానికి కారణాలు ఏమిటి, అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షా మాదిరిగా వెనుక ఎవరైనా ఉండి అతనితో ఇలాంటి ప్రకటన చేయించారా అనేది ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఐటీ వారు ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ద్వారా 64275 మంది నుంచి 65250 కోట్ల రూపాయల నల్లధనం వెలికి వచ్చినట్లు గతంలో అధికారులు ప్రకటించారు. అయితే ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత.. గణాంకాలు మారాయి. 71726 మంది నుంచి 67382 కోట్ల రూపాయలు వెల్లడైనట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు.

