సంక్రాంతి అంతా జగన్ పాదయాత్రలోనే...!

వైఎస్ జగన్ పాదయాత్రలో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా చంద్రగరి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి జగన్ యాత్రకు సంక్రాంతి శోభను తీసుకొచ్చారు. తమ పార్టీ అధినేత జగన్ తన ప్రాంతానికి వస్తుండటంతో చెవిరెడ్డి ప్రత్యేక శ్రద్థ తీసుకున్నారు. సంక్రాంతి వాతావరణాన్ని పాదయాత్రలో కల్పించారు. పాదయాత్ర వచ్చే మార్గాన్ని గొబ్బెమ్మలు, గంగిరెద్దులతో ఉంచారు. పక్కల చెరుకుగడలు, పూలలతో అలంకరించారు. దీంతో జగన్ ప్రయాణిస్తున్న మార్గమంతా సంక్రాంతి శోభతో నిండిపోయింది.
వేదికలే కాదు...
జగన్ ప్రసంగించే బహిరంగ సభలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. నులక మంచాన్ని వేదికగా చేశారు. అలాగే వేదిక చుట్టూ పల్లె వాతావరణాన్ని కల్పించారు.వేదిక చుట్టూ చెరకు గడలను ఏర్పాటు చేశారు. పూలతో అలంకరించిన ఎడ్ల బండ్లను సిద్ధం చేశారు. వేదిక చుట్టూ సంక్రాంతి ముగ్గులతో అలంకరించారు. పంట పొలాల మధ్య సభను పెట్టడంతో ఇక్కడ పండగ వాతావరణంచోటు చేసుకుంది. ముగ్గులతో పాటు కూరగాయాలు, పండ్లు, గొబ్బెమ్మలతో పాటు గుమ్మడి కాయాలను కూడా వేళ్లాడదీశారు. దీంతో జగన్ ఆ అలంకరణ చూసి ముగ్డుడయి పోయారు.
ప్రయాణించే మార్గం మొత్తం....
జగన్ ప్రయాణిస్తున్న ఇంటి ముందు గొబ్బెమ్మలతో అలంకరించారు. సంక్రాంతి ముగ్గులు వేశారు. పొయ్యి మీద పొంగుతున్న వెన్నముద్దలు జగన్ కు స్వాగతం పలికాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లె పంచాయతీలోని నెమలిగుంట పల్లి, కుప్పం బాదురు గ్రామాల వద్ద ఇదే వాతావరణం కన్పించింది. మహిళలు ఈ సందర్భంగా జగన్ కు హారతి పట్టారు. ఇక మంగళవాయిద్యాలు పాదయాత్ర ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతోచిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర మొత్తం సంక్రాంతి సందడే కన్పించింది. జగన్ అస్వస్థతకు గురైనా ఈ అలంకరణ, ఆప్యాయతలను చూసి వేగంగా అడుగులు ముందుకు వేశారు.
- Tags
- జగన్

