శీల పరీక్షకు తరచూ గురౌతున్న ఈవీఎంలు ....

దేశంలో ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో ఈవీఎం ల అంశమే హాట్ టాపిక్ అయిపోతుంది. ఎన్నికల్లో ఓడిపోతామని అనుమానం వున్న పార్టీలు నేతలు ముందుగా ఈవీఎం లపై ఒక ఆరోపణ చేసి పారేస్తున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ప్రజా విజయమని రాకపోతే ఈవీఎం లను అధికారపార్టీ దుర్వినియోగం చేసిందని ముందే అన్నామని అనే ప్రమాదకర ధోరణి పెరిగిపోయింది. ప్రతి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం శీలపరీక్షకు సిద్ధమని ప్రకటించుకోవాలిసిన దౌర్భాగ్యం దర్శనమిస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు ఆరోపణలు వేగవంతంగా వ్యాప్తి చెందినట్లు ఏవి ప్రజల్లోకి వెళ్ళవని వారు వేసే ఓటు వేరే పార్టీకి వెళుతుంది అనే రీతిలో సాగించే తప్పుడు ప్రచారాలకు స్వస్తి పలకాలని జనంలో విశ్వాసం పాదుకొల్పాలని ఎన్నికల సంఘం కోరుకుంటుంది.
గుజరాత్ ఎన్నికల్లో బ్లూ టూత్ టెక్నాలజీ ...
దేశమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూసిన గుజరాత్ ఎన్నికల్లో బ్లూ టూత్ టెక్నాలజీ తో ఈవీఎం లను మ్యానేజ్ చేస్తున్నారనే ఆరోపణలు పోలింగ్ రోజు గుప్పు మన్నాయి. అనేక చోట్ల ఈ విఎంలను అప్పటికప్పుడు మార్పు చేయాలిసి వచ్చింది. పోలింగ్ బూత్ లలో వాడే ఈవీఎంలపై ఇలా ఎవరికి వారు అనుమానాలు వ్యక్తం చేయడం వెంటనే నిజనిర్ధారణ చేయకుండా ఎన్నికల అధికారులు సైతం కొత్త వాటిని అక్కడ ఏర్పాటు చేయడం ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలాగే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు పెల్లుబికేలా చేస్తుంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ తో సహా ఆప్ తదితర పార్టీలు సైతం ఈవీఎం లను తమకు అనుకూలంగా అధికార పార్టీలు మలుచుకుంటున్నాయన్న సహేతుక, సాంకేతిక అంశాల ప్రాతిపదిక లేకుండా ఆరోపిస్తున్నాయి. రాజకీయ ఆరోపణల్లో భాగంగా వీటిని విపక్షాల్లో వున్నవారు చేయడం ప్రజాస్వామ్య బలాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదకర ధోరణి అని ఎన్నికల సంఘమే కాదు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్న అంశం. ఎప్పటికి వీటికి అంతా చెక్ పెడతారో మరి.
- Tags
- ఈవీఎంలు

