శివసేన బీజేపీపై ఇలా కక్ష తీర్చుకుంటోందా?

శివసేన బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బీజేపీకి ప్రధాన శత్రువుగా శివసేన మారిపోతుందా? అన్న రీతిలో వ్యవహరిస్తోంది. బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడమే శివసేన లక్ష్యంగా కన్పిస్తోంది. గత కొంతకాలంగా శివసేన, బీజేపీల మధ్య ఆంతర్గత పోరు ప్రారంభమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేందుకే శివసేన ప్రయత్నిస్తుంది.
శత్రుపక్షంగానే వ్యవహరిస్తూ....
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన మిత్రపక్షంగా వ్యవహరించడం లేదు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ శివసేన విడిగా పోటీ చేసింది. బీజేపీకి చివరి నిమిషం వరకూ టెన్షన్ పెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును చీలిక తేవడమే లక్ష్యంగా శివసేన పోటీకి దింపడంతో చివరకు చచ్చీ చెడీ బీజేపీ ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవాల్సి వచ్చింది. యూపీలోనూ అదే తరహాగా వ్యవహరించింది. ఇక తాజాగా కర్ణాటకలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలపైన కూడా శివసేన దృష్టి పెట్టింది.
మరాఠీల ప్రాబల్యం ఉన్న చోట....
హిందూ ఓటర్లు, మరాఠీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శివసేన పోటీచేయాలని నిర్ణయానికి వచ్చింది. సుమారు 50 స్థానాల్లో తాము బరిలోకి దిగుతామని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ ప్రకటించారు. ముఖ్యంగా మరాఠీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో పోటీకి దింపాలని భావిస్తోంది. బెల్గాం ప్రాంతం మహారాష్ట్రకు అనుకునే ఉంటుంది. బెల్గాం ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ డిమాండ్ పెద్దయెత్తున విన్పిసున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో అభ్యర్థులను పోటీకి దించకూడదని శివసేన నిర్ణయించింది.
బీజేపీని దెబ్బకొట్టడానికేనా?
ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ విలవిల్లాడుతోంది. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అందుకు ధీటుగానే ప్రచారాన్ని చేస్తోంది. మరాఠీలు, హిందూ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే శివసేన పోటీ చేయాలని నిర్ణయించడం కమలం పార్టీకి చెక్ పెట్టడానికేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ ఓట్లు చీలిస్తే అది కాంగ్రెస్ కు ఉపయోగ పడుతుంది. ఈ కారణాలతోనే శివసేన అభ్యర్థులను కర్ణాటక ఎన్నికల బరిలోకి దించుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏ ఎన్నికలు జరిగినా కమలం పార్టీకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది శివసేన.
