శశికళ వద్ద పదికోట్లు లేవా?

బెంగళూరు పరప్పణ అగ్రహారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ పదికోట్ల రూపాయల జరిమానా నేటి వరకూ చెల్లించలేదు. అక్రమాస్తుల కేసులో శశికళకు, ఆమె వదిన ఇళవరిసికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటుగా చెరి పదికోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే శశికళ, ఇళవరసిలు జైలు శిక్ష ఏడాది పూర్తయింది. అయితే ఇప్పటి వరకూ జరిమానా చెల్లించలేదు. అయితే జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. నాలుగేళ్లలో ఒక ఏడాది పూర్తి కావడంతో మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే శశికళ పదికోట్ల జరిమానాను చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
శిక్షాకాలం పూర్తయ్యేలోపు....
అయితే ఈ విషయాన్ని న్యాయస్థానంలో డీఎంకే తరుపున న్యాయవాది బాలాజీ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. శశికళ, ఇళవరసి నుంచి పదికోట్ల జరిమానాను రాబట్టేందుకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే శశికళ న్యాయవాది మాత్రం దీనిని కొట్టిపారేశారు. శిక్షాకాలం ముగిసేలోగా జరిమానాను చెల్లించవచ్చని తీర్పు స్పష్టం చేసిందని, జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టంగా చెప్పినా ఎందుకు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
తీర్పుపై న్యాయస్థానానికి వెళ్లాలని.....
కాగా శశికళ, ఇళవరసి పై వచ్చిన తీర్పు పై తిరిగి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించారని, ప్రస్తుతం ఏడాది పూర్తయింది కాబట్టి ఇక రెండేళ్ల పదినెలల మాత్రమే శిక్షాకాలం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే శశికళ, ఇళవరసిలు మాత్రం చెరి పదికోట్లు చెల్లించలేక పోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. తిరిగి తీర్పుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఒకవేళ తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే చివరి సంవత్సరం పది కోట్లు చెల్లించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- శశికళ

