’శశి‘ కాంతుల్లో పార్టీ : ఇక కులాల పెత్తనం!

అమ్మ ఇక లేరు. అయితే ఇన్నాళ్లూ ఆమె ఏకఛత్రంగా పాలన సాగించిన అన్నా డీఎంకే పార్టీ అనాథ అయిపోవడమేనా? నెంబర్ టూ అంటూ ఎవరూ తయారు కాని, లేని వాతావరణంలో పార్టీకి ఏకైక పెద్దదిక్కుగా వ్యవహరించిన జయలలిత .. తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన రోజు నుంచే దీనికి సంబంధించిన కసరత్తు జరిగినట్లు సమాచారం. అమె మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి వారసుడిగా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్నారు గానీ.. అది కూడా.. ఆయనకు సర్వాధికారాలు కట్టబెట్టడం కాదుట. అమ్మ తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో చేతిలో ఉంచుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
శశికళ పార్టీపై ఆధిపత్యం సంపాదించడం గురించి చెదురుమదురుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఒక దశలో ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందిట. అయితే అవినీతికి సంబంధించిన కేసులు ఇంకా కోర్టు విచారణలోనే ఉండడం... ఏ క్షణంలోనైనా మళ్లీ శిక్ష పడే అవకాశం ఉండడంతో ఆమె వెనక్కి తగ్గి పన్నీర్ సెల్వంను తెరపైకి తెచ్చారుట. అమ్మ జయలలిత పట్ల చూపించినట్లే.. శశికళ కు కూడా విధేయుడుగా ఉండగల తత్వం ఉన్నది గనుకనే.. వారసుడి ఎంపికలో చిన్న ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ.. శశికళ వాటిని చక్కబెట్టేసి అతడిని ముఖ్యమంత్రిని చేసినట్లు తెలుస్తోంది.
అయితే అన్నా డీఎంకే పార్టీపై ఇక కులాల పెత్తనం ప్రధాన పాత్ర పోషించే వాతావరణం కనిపిస్తోంది. తమిళనాడులో దేవర్ లు, నాడార్ లు రెండు రకాల వర్గాలుగా రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. శశికళ దేవర్ వర్గానికి చెందిన నాయకురాలు. ఆమె తాను నేరుగా పదవి అందుకోకుండా ప్రత్యామ్నాయం కోసం చూసినప్పుడు.. పన్నీర్ సెల్వం కూడా దేవర్ కావడం అతనికి కలిసి వచ్చిన అంశం. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే శశికళ వ్యూహాత్మకంగా ఉన్నదని, దేవర్ వర్గానికి చెందిన ఎక్కువ మందికి జయలలిత ద్వారా టికెట్లు ఇప్పించుకున్నదని సమాచారం. ఆ నేపథ్యంలో.. పార్టీ మీద శశికళ గుత్తాధిపత్యం నడిచే అవకాశం కనిపిస్తోంది.
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఆయన ‘కీ’ మొత్తం చిన్నమ్మ చేతిలో ఉంటుందనే తమిళ సోదరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత వంటి పెద్ద దిక్కు కనుమరుగయ్యాక , పార్టీలో అనివార్యంగా పుట్టే అసంతృప్తులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

