శబరిమల కేసు పరిష్కరించడమెలా?

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో లక్షలాది మంది భక్తులు మాల ధారణతో వస్తుంటారు. ఇది ముఖ్యంగా పురుషులు నలభై రోజులు నిష్టతో దీక్ష ఉండి నల్లటి వస్త్రాలు ధరించి అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకు వెళుతుంటారు. ప్రధానంగా అక్టోబర్ మాసంలో ప్రారంభమయ్యే ఈ అయ్యప్ప మాలలు జనవరి వరకూ కొనసాగుతాయి.అయితే ఈ ఆలయంలోకి మహిళలను ప్రవేశించ నివ్వరు. పదేళ్ల లోపు బాలికలను మాత్రమే అనుమతిస్తారు. పదేళ్లు నిండి యాభై ఏళ్ల లోపు ఉన్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. దీంతో ఇది మహిళల హక్కులను కాలరాయడమేనంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మద్దతిస్తున్న కేరళ సర్కార్......
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించింది. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది. మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయకమిటీ తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా? అన్నది పరిశీలించాల్సి ఉందని త్రిసభ్య బెంచ్ అభిప్రాయపడింది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని వాదిస్తోంది. ఆలయ కమిటీ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. గతంలో శబరిమల జ్యోతి విషయంలోనూ ఇదే వివాదం నడిచింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం జరుగుతుందన్న దానిపై విచారణ కమిటీ కూడా నియమించి అలాంటిదేమీ లేదని తేల్చింది. మొత్తం మీద శబరిమల ఆలయం మరోసారి వార్తల్లో కెక్కింది.
- Tags
- శబరిమల

