వైసీపీలో వలసలు ఇక ఆగవా?

వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు తప్పేట్లు లేవు. వరుస బెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. మొన్న వంతల రాజేశ్వరి...నేడు గిడ్డి ఈశ్వరి ఇద్దరూ పార్టీని వీడిపోయారు. చంద్రబాబు రాజకీయాలు వద్దంటూనే రాజకీయ పునరేకీకరణకు పిలుపునిచ్చారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నారు. గిడ్డి ఈశ్వరిని ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టకుండా తిట్టేశారు. పాడేరులో కొన్నాళ్ల క్రితం గిరిజన గర్జనలో ఈశ్వరి చంద్రబాబును పాతేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇక అసెంబ్లీలో సయితం గిడ్డి ఈశ్వరి టీడీపీ సర్కార్ ను దులిపేస్తూ ఉండేవారు. అలాంటి గిడ్డి ఈశ్వరి పార్టీని వీడటం వైసీపీకి పెద్ద దెబ్బే. ఇక చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పట్లో ఆగేలా లేదు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.
మరికొందరు అతి త్వరలో....
వీరిలో కొందరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే వారిని విడతల వారీగా పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా జగన్ పాదయాత్రను మానసికంగా దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహంగా కన్పిస్తోంది. కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే వైసీపీని వీడే అవకాశమున్నట్లు సమాచారం. అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు వస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, అభివృద్ది వేగంగా జరగాలంటే రాజకీయాలు కూడదని ఒకవైపు చంద్రబాబు చెబుతూనే మరోవైపు వలసలకు జెండా ఊపేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత మంది టీడీపీని వీడి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. గిడ్డి ఈశ్వరి చేరికతో మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు 22 మంది టీడీపీలో చేరినట్లయింది.
- Tags
- వైసీపీ

