వైసీపీలో ఈయనకొక్కడికే ప్రమోషన్

వైసీపీలో విజయసాయిరెడ్డిది కీలక భూమిక ఉంటుందని జగన్ చెప్పకనే పార్టీ శ్రేణులకు చెప్పారు. వైసీపీలో నెంబర్ 2 అన్నది ఇప్పటి వరకూ కొంత కన్ఫ్యూజన్ గా ఉన్న వైసీపీ నేతలకు జగన్ క్లారిటీ ఇచ్చినట్లయింది. తన తర్వాత విజయసాయిరెడ్డి ఉంటారని జగన్ చెప్పినట్లయింది. విజయసాయి రెడ్డిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగానే ఉన్న విజయసాయి రెడ్డికి ఒక రకంగా ప్రమోషన్ లభించినట్లయింది. విజయసాయి రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ వెంట జైలుకు కూడా వెళ్లి వచ్చారు. జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ విజయసాయి రెడ్డికి క్షుణ్ణంగా తెలుసు. తనకు ఇంతటి హెల్ప్ చేసిన విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. ఢిల్లీలో కూడా విజయసాయి రెడ్డి అందరి నేతలతో పరిచయాలు పెంచుకుని ప్రధాని అపాయింట్ మెంట్ ను జగన్ కు ఇప్పించగలిగారు.
పాదయాత్ర విజయసాయి కనుసన్నల్లోనే.....
అప్పటి నుంచి జగన్ కు సాయి రెడ్డిపైనే నమ్మకం ఎక్కువైంది. నిన్నమొన్నటి వరకూ వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి లు చక్రం తిప్పేవారు. రవీంద్ర నాధ్ రెడ్డి కడప జిల్లా వరకూ పరిమితమయినా... కొన్ని జిల్లాల్లో వేలు పెట్టేవారు. ఇక వైవీ సుబ్బారెడ్డి అయితే పార్టీ మొత్తం తాను చెప్పినట్లే నడుచుకోవాలన్న సంకేతాలను నేతలకు పంపారు కూడా. బొత్స, ధర్మాన ప్రసాదారావు లాంటి సీనియర్ నేతలు నిన్న గాక మొన్న వచ్చిన వైవీ చెప్పే సలహాలు వింటూ ఆశ్చర్యం కూడా అనేకసార్లు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయికి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. జగన్ ఆర్థిక లావాదేవీలతో పాటు కార్యక్రమాలు మొత్తం విజయసాయి రెడ్డే చూసుకోనున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి జరిగే పాదయాత్ర కూడా కంప్లీట్ గా విజయసాయి కనుసన్నల్లోనే నడవాల్సిందే. మొత్తం విజయసాయి రెడ్డికి ప్రమోషన్ లభించడంపై కొందరు వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
- Tags
- విజయసాయి రెడ్డి

